తెనాలి తహసీల్దార్‌కు సీఎం అభినందన
తెనాలి రూరల్/గుంటూరు వెస్ట్: తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అభినందించారు. తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్‌ఓ ధ్రువీకరణ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ప్రత్యేకంగా తహసీల్దారును సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించి, అభినందించారు. రెవెన్యూ శాఖలో అరుదైన రికార్డును గోపాలకృష్ణ నెలకొల్పారని, ఇరు తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి లేని ఘనత తెనాలి తహసీల్దార్ కార్యాలయం సాధించటం అభినందనీయమని ప్రశంసించినట్లు గోపాలకృష్ణ రాత్రి వెల్లడించారు. ఇటీవల 5,800 మంది రైతు సమస్యలను సింగిల్ విండో విధానంలో తహసీల్దారు పరిష్కరించారు. కార్యాలయ సిబ్బంది పనితీరుతోపాటు ప్రజలతో వ్యవహరించే విధానంలో గోపాలకృష్ణ మంచి మార్పులు తీసుకొచ్చారు. శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని ఇటీవల దాతల సహకారంతో సర్వాంగ సుందరంగా ఆధునికీకరించి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మనోహర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సమక్షంలో ఐఎస్‌ఓ ప్రతినిధి బృందం తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను ఈ నెల 15వ తేదీన అందించిన సంగతి విదితమే. తహసీల్దార్ వెంట రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.


