హమ్మయ్యా... బతికించారు..
స్మార్ట్ ఫోన్ నుంచే జీవన ధ్రువీకరణ లైఫ్ సర్టిఫికెట్లు అవసరం లేదు జీవన్ ప్రమాణ్ యాప్‌తో వెసులుబాటు
సత్తెనపల్లి: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ నుంచే ప్రభుత్వ పింఛన్‌దారులు తాము ఉన్న చోటు నుంచే జీవన్ ప్రమాణ్ యాప్‌లో ముఖ ఆధారిత గుర్తింపు పంపే సౌలభ్యం కలిగింది. వయోభారం మూలాన నడవలేని స్థితిలో ఉన్న పింఛన్‌దారులను గుర్తించి, ఉపఖజానా కార్యాలయం సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి, జీవన్ ప్రమాణ్ పేరుతో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వాస్తవానికి బయోమెట్రిక్, ఐరిస్ విధానాల్లో చేతి వేలిముద్రలు అరిగి పోవడం, కంటి సమస్యలతో కొందరికి ఇబ్బందులు తప్పేవి కాదు. అవసరమైన సాంకేతికతను నవీకరిస్తున్నా సమస్యలు వెంటాడేవి. ఇప్పుడు యాప్‌తో ముఖ ఆధారిత గుర్తింపు విధానం అమల్లోకి తేవడంతో పండుటాకుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
పల్నాడు జిల్లాలో 12,242 మంది
ఏటా జనవరి నెల ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 28 లోపు జీవన ప్రమాణ పత్రాలు ఉపఖజానా కార్యాలయాల్లో పెన్షనర్లు సమర్పించాల్సి వచ్చేది. జిల్లాలో 9 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు కలిపి 12,242 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.52,13,34,735 పింఛన్లు ఇస్తున్నారు.


