ఆటో బోల్తా : పలువురికి గాయాలు
వేమూరు(అమర్తలూరు) : ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెరవలిపాలెం గ్రామానికి చెందిన కూలీలు మొక్కజొన్న, జొన్న పొలాల్లో పనుల కోసం సోమవారం ఉదయం అమృతలూరు బయలుదేరారు. డ్రైవరు ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపుతుండగా అమర్తలూరు మలుపు వద్ద బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలు గాయపడ్డారు. కోటేశ్వరమ్మకు తీవ్రం గానూ శ్రీనివాసరావు, అంజలికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ రవితేజ తెలిపారు.
వేమూరు(భట్టిప్రోలు): అతి వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఐలవరం జరిగింది. గ్రామానికి చెందిన వీరంకి సాంబశివరావు(69) ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం చేసి ఇంటి ముందున్న హైవే పైకి వచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎం. శివయ్య సోమవారం తెలిపారు. సాంబశివరావు కుమారుడు ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
వార్షిక నేర నియంత్రణ సమావేశంలో బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్
బాపట్ల టౌన్: జిల్లాలో ఫోక్సో కేసులు గత ఏడాది కంటే 35 శాతం తగ్గాయని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం వార్షిక నేర నియంత్రణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది జిల్లా పోలీస్ యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, మహిళల రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. వ్యవస్థను బలోపేతం చేయడం, రౌడీలకు కౌన్సెలింగ్‌తో పాటు గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మండలస్థాయి అధికారులతో పల్లె నిద్ర, నేరాలు నమోదైన వెంటనే వేగవంతమైన దర్యాప్తు చేసి చార్జ్‌షీట్లు దాఖలతో పాటు రౌడీల కదలికలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు.
సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన మహిళల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల వినియోగం, బైండోవర్ కేసులు, కౌన్సెలింగ్, చెడు నడత కలిగిన వారిపై నిఘా కారణంగా నేరాల తీవ్రత తగ్గిందని వివరించారు. మహిళల భద్రత కోసం ఐదు ప్రత్యేక శక్తి బృందాల్ని ఏర్పాటు చేసి 2,611 అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు 66,000 పైగా శక్తి యాప్ డౌన్‌న్‌లోడ్లు జరిగాయని చెప్పారు. ప్రతి శనివారం ‘‘నో యాక్సిడెంట్ డే’’గా 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ అవసరంపై 640 అవగాహన కార్యక్రమాలతో పాటు కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ట్రావెల్స్ బస్సులు, భారీ వాహనాలపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని వివరించారు. అవసరమైతే డ్రైవర్లతో పాటు యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలతో పనిచేస్తూ, డిజిటల్ అరెస్ట్, ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు పాల్పడిన ముద్దాయిలను ఇతర రాష్ట్రాల్లో అరెస్టు చేశామని తెలిపారు. 13 కేసుల్లో కఠిన శిక్షలు, ఏడు కేసుల్లో జీవిత ఖైదు, రెండు కేసుల్లో 20 సంవత్సరాల జైలుశిక్షలు పడినట్లు పేర్కొన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రూ.3.62 కోట్ల రికవరీతో పాటు, ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో రూ.40 లక్షల విలువైన 60 బైకులను రికవరీ చేసి నిందితులకు జైలుకు పంపించామని వివరించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు, రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ ఎండి.మోయిన్ పాల్గొన్నారు.
నరసరావుపేట రూరల్: నకిలీ కార్ల కేసులో ఏ–6 నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్‌ను నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ కార్ల కేసులో తొమ్మిది మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఇందులో నలుగురును అరెస్ట్ చేయగా, నకరికల్లుకు చెందిన రామకృష్ణ న్యాయస్థానంలో లొంగిపోయాడు. నకిలీ కార్లకు డాక్యుమెంట్లను హైదరాబాద్‌కు చెందిన ప్రకాష్‌గౌడ్, వైజాగ్‌కు చెందిన వర్మలు అందజేశారు. ఈ కేసులో వీరిని ఏ–6, ఏ–7 నిందితులుగా పేర్కొన్నారు. ప్రకాష్‌గౌడ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నిందితుడు వర్మను అరెస్ట్ చేయాల్సి ఉంది.
ఆటో బోల్తా : పలువురికి గాయాలు


