3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు
పెదకాకాని: రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశాల ప్రచార ప్రతులను వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్‌లర్ వాసిరెడ్డి మహదేవ్, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మొవ్వా శ్రీనివాసరెడి మాట్లాడుతూ వైజ్ఞానిక పద్ధతులలో చరిత్ర అధ్యయనాన్ని ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర పరిశోధనల ప్రగతిని మూల్యాంకన చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమన్నారు. అవగనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతారనీ, ఆధునిక చరిత్ర, సాంకేతికత, సామాజిక అంశాలపై పరిశోధనా పత్రాల సమర్పణ, చర్చలు జరుగుతాయని వివరించారు. పాలక సభ్యురాలు వాసిరెడ్డి ప్రత్యూష, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, ఏఎన్‌యూ హిస్టరీ ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ కె.గిరిబాబు, వీవీఐటీయూ పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవికృష్ణ పాల్గొన్నారు.
●గన్నవరం ఏడీఏ ఎం.సునీల్
● పలు ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు
తెనాలి టౌన్: ఎమ్మార్పీ కంటే అధికంగా ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గన్నవరం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం.సునీల్ హెచ్చరించారు. పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో సోమవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, తెనాలి మండల వ్యవసాయాధికారి కె.సుధీర్‌బాబు, గుంటూరు మండల వ్యవసాయాధికారి బి.కిశోర్ తనిఖీల్లో పాల్గొన్నారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించి, రికార్డు తనిఖీ చేశారు. రిజిస్టర్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను ఎమ్మార్పీకంటే అధికంగా విక్రయిస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి.కిశోర్, ఏఈఓ మురళి, తదితరులు ఉన్నారు.
రూ.15లక్షల ఎరువుల అమ్మకాలు నిలుపుదల
చేబ్రోలు: రైతులకు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ రాష్ట్ర తనిఖీ బృందం అధికారి గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, కమీషనరేట్ కార్యాలయ వ్యవసాయశాఖాధికారి బి. సురేష్‌బాబు తెలిపారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, వడ్లమూడి, చేబ్రోలు గ్రామాల్లోని ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో రాష్ట్ర బృందం సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పొన్నూరు ఏడీఏ వి. రామకోటేశ్వరి, స్థానిక ఏఓ ప్రియదర్శినిలు పాల్గొన్నారు. యూరియా నిల్వలు, అమ్మకాలు, ఎరువుల లభ్యత గురించి పరిశీలన చేశారు. శేకూరు, వడ్లమూడి గ్రామాల్లోని రెండు షాపుల్లో సరైన పత్రాలు, బిల్లులు లేకపోవటంతో రూ.15,19,870 విలువైన 85.4 మెట్రిక్ టన్నుల ఎరువులను నిలుపదల చేశారు. మండలంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ఎరువులు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రికార్డు మెయింటైన్ సరిగా లేని వారికి సంజాయిషీ తీసుకొని, లైసెన్స్ సస్పెన్షన్‌కి ఆదేశాలు జారీ చేశారు.


