
గొర్రెలు, మేకల పెంపకం సంఘానికి అన్యాయం
సంతమాగులూరు(అద్దంకి): కూటమి ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపక సంఘానికి రూపాయి కేటాయించలేదని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి పెద్దబ్బాయి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే పూర్తిగా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి పిలుపునిచ్చారు. శనివారం బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లోని కొప్పెరపాడు, ఎస్‌ఎల్ గుడిపాడు, ఎంకే పాలెం, మామిళ్ళపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి, మహాసభల కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు 17 ,18 వ తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వృత్తి రక్షణ, వృత్తిదారుల సంక్షేమం కోసం ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించి సమగ్ర కార్యాచరణ రూపకల్పన చేయబోతున్నట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెల పెంపకం జీవనాధారంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో రెండు కోట్ల 21 లక్షల గొర్రెల మేకల సంపద ఐదువేలకు పైగా పెంపకం దార్ల సహకార సంఘాలు, సుమారు నాలుగు లక్షల కుటుంబాలపైగా ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారన్నారు. గ్రామీణ స్థాయిలో సొసైటీల్లో జిల్లా స్థాయిలో యూనియన్లు, రాష్ట్రాల్లో ఫెడరేషన్ ఏర్పాటు చేసినా, వాటికి తగిన నిధులు ప్రభుత్వాలు కేటాయింపు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సమాజానికి బలమైన నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్న కీలకమైన రంగాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్యాయన్నారు. బీమా పథకాలు సరిగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మందులు, టీకాలు, డీ వార్మింగ్ కోసం బడ్జెట్లో నిధులు పెంచాల్సిన అవసరం ఉందని నా బార్డు ద్వారా 50% సబ్సిడీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, రాష్ట్ర బాధ్యులు పూసపాటి వెంకట్రావు, బాపట్ల జిల్లా సంఘం కార్యదర్శి బుర్రి ఆంజనేయులు, చిమట సైదులు, పెద సింగరయ్య, తదితరులు పాల్గొన్నారు.
సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దబ్బాయి