
తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడు
● గంటల వ్యవధిలోనే కేసు ఛేదించిన పోలీసులు ● క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత
కారంచేడు: ఇంటి వద్ద ఆడుకుంటూ బయటకు వచ్చిన నాలుగు సంవత్సరాల బాలుడు తప్పిపోయాడు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు, బంధువులు కారంచేడు పోలీస్‌లకు సమచారం అందించారు. రంగంలోకి దిగిన కారంచేడు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా తమ సిబ్బందితో మూడు టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గంటల వ్యవధిలోనే బాలుడిని క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు... కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తన కుమారుడు ఎప్పటిలాగానే ఆడుకుంటూ బయటకు వచ్చాడు. ఎవరూ గమనించకపోడవంతో బాలుడు కుంకలమర్రు–చీరాల మధ్య షటిల్ సర్వీస్‌గా తిరిగే పల్లెవెలుగు బస్సు ఎక్కేశాడు. బస్సులో ప్రయాణికులు, కండక్టర్ కూడా గమనించలేదు. చీరాలలో బస్సు దిగిన బాలుడు మరలా చిలకలూరిపేట వైపు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కి పర్చూరులో దిగాడు. ఈ విషయం జరిగిన వెంటనే బాలుని అమ్మమ్మ పొత్తూరి కాంతమ్మ మరికొంత మంది వెతుకుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన మరియమ్మ అనే మహిళ బాలుడు బస్సు ఎక్కడం గమనించానని తెలిపింది. వెంటనే వారు కారంచేడు ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బాలుడి ఫొటోను సోషల్‌మీడియా, సమీప పోలీస్‌స్టేషన్‌లకు అందించారు. అది గమనించిన పర్చూరు ఎస్‌ఐకి బాలుడు కనిపించడంతో వెంటనే కారంచేడు ఎస్‌ఐకి సమాచారం అందించారు. ఉదయం 11 గంటల సమయంలో మిస్ అయిన బాలుడిని ఒంటి గంటకు కనుగొని తల్లిదండ్రులకు అప్పగించారు. కేవలం గంటల వ్యవధిలోనే బాలుడిని అప్పగించారు. బాలుడి ఆచూకీ కోసం కృషి చేసిన ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా, పోలీస్ సిబ్బందిని బాపట్ల ఎస్పీ తుషార్‌డూడీ ప్రత్యేకంగా అభినందించారు.