
ఉపాధిలో అవినీతి మస్టర్లు
ఉపాధి హామీ పనుల్లో తవ్వేకొద్దీ అవినీతి బయటకు వస్తోంది. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అక్రమ సొమ్ములో వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పచ్చనేతలూ అందిన కాడికి మింగేస్తున్నారు. రూ.కోట్ల మేరకు ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతోంది.
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బల్లికురవ మండలం మల్లాయిపాలెంకు చెందిన సర్వలత ముండ్లమూరు మండలంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఉపాధి పనికి వెళుతున్నట్లు (జాబ్ కార్డు నంబరు 50136) మస్టర్ వేశారు. ఆమె ఖాతాకు డబ్బులు మళ్లించారు. ఇదే గ్రామానికి చెందిన మార్క్ రెండు సంవత్సరాలుగా చైన్నెలో ఉంటున్నా (జాబ్ కార్డు నంబరు 50192) ఉపాధి పని చేస్తున్నట్లు చూపిస్తున్నారు. దివ్యాంగురాలు నాగిపోగు సైదమ్మ, (జాబ్‌కార్డు నంబర్ 040 653), అంగన్‌వాడీ టీచర్ సత్యవతి (జాబ్ కార్డు నంబర్ 040 566) వంటి సంబంధం లేని పేర్ల మీద మస్టర్లు వేస్తున్నారు. 80 సంవత్సరాల బండి జయమ్మ, (జాబ్‌కార్డ్ నంబర్ 040 431), దివ్యాంగుడు బండి నాగరాజు (జాబ్‌కార్డ్ నంబర్ 50118)లు సైతం ఉపాధి పనులకు వెళుతున్నట్లు చూపారు. వారి పేరున డబ్బులు డ్రా చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటున్న గాయత్రి (జాబ్‌కార్డు నంబర్ 50 131), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మణికంఠ (జాబ్‌కార్డు నంబర్ 50 148), లాయర్ ప్రసాద్ (జాబ్‌కార్డు నంబర్ 040 369).. ఇలా చెప్పుకొంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంది.
సగానికిపైగా అవినీతే...
ఒక్క మల్లాయిపాలెం మాత్రమే కాదు... జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఈ గ్రామంలోనే 70 మందికి పైగా ఫేక్ మస్టర్లు వేస్తున్నట్లు మాజీ సర్పంచ్ అబ్బారెడ్డి బాలకృష్ణ ఉన్నతాధికారులకు స్వయంగా ఫిర్యాదు చేసినా స్పందన శూన్యం. ఇదే మండలంలోని కొప్పరప్పాడు, వైదన, ఎస్‌ఎల్ గుడిపాడు, కూకట్లపల్లి, కొమ్మినేనివారి పాలెం, మల్లాయిపాలెం, వేమవరం గ్రామాల పరిధిలో రూ. 12 కోట్ల విలువచేసే 645 పనులు జరిగాయి. సగానికిపైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొప్పరప్పాడు గ్రామసభలో అక్రమాలు వెలుగు చూడగా, మూడు రోజుల క్రితం జిల్లా సంయుక్త కలెక్టర్ నాగిరెడ్డి కొమ్మినేనివారిపాలెం, వైదన, ఎస్‌ఎల్ గుడిపాడుల్లో తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేసిన కాలువ, చెరువు, కుంటల పూడికతీత పనులను కొత్తగా రికార్డు చేసి బిల్లులు స్వాహా చేసినట్లు ఆయన విచారణలో బయటపడింది. ఆగ్రహించిన సంయుక్త కలెక్టర్.. మండలంలో జరిగిన మొత్తం పనులపై నివేదిక ఇవ్వాలని తహసీల్దారును ఆదేశించారు. ఒక్క బల్లికురవ మండలమే కాదు అద్దంకి నియోజకవర్గంతోపాటు వేమూరు, రేపల్లె, బాపట్ల, చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లోనూ అక్రమాలు జరిగాయి. కృష్ణా సాగునీటి కాలువలు ఉన్న రేపల్లె, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు సమాచారం.
అద్దంకి, రేపల్లె, వేమూరు, బాపట్లలో అక్రమాలు పర్చూరు, చీరాలల్లోనూ పథకంలో అదే తీరు పాత పనులకు రికార్డుల సృష్టి కుప్పలు తెప్పలుగా ఫేక్ మస్టర్లు ఇప్పటికే కృష్ణా, సాగర్ కాలువలకు నీళ్లు పనుల తనిఖీ లేదు.. అక్రమం బయటకు రాదు వాటాల కోసం డ్వామా పీడీ వెంపర్లాట కనీసం పట్టించుకోని ఉన్నతాధికారులు చేసిన పనులు చూపితేనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బిల్లులు
అన్ని స్థాయిల వారికి వాటాలు
ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, పీఆర్‌ఏఈలు, ఏపీవో, డ్వామా జిల్లా అధికారి వరకూ అవినీతిలో వాటాలు తీసుకుంటున్నారు. స్థానిక పచ్చనేతకు కూడా వాటాలు వెళుతున్నాయి. ఫిర్యాదులు చేసినా డ్వామా జిల్లా అధికారి స్పందించడం లేదు. పైగా అక్రమాలను మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు డ్వామా అధికార వర్గాల్లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన పని మేరకు కొలతలు చూసి డబ్బులు ఇస్తే వాస్తవంగా పనిచేసిన కూలీలకు గిట్టుబాటు అవుతుంది. కానీ ఫేక్‌మస్టర్లకు డబ్బులు ఇస్తుండడంతో నిజంగా పనిచేసిన పేదలు నామమాత్రపు కూలీతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
పచ్చ నేతలకు ఇవ్వాల్సిందే...
వాస్తవానికి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కొత్త వారిని నియమించుకోవాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. జిల్లాలోని చాలా పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్‌లు ఉండటంతో పచ్చ నేతలు ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు తీసుకొని దందా చేస్తున్నారు. ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి సీనియర్ మేట్ల పేరుతో కొత్తవారిని నియమించుకున్నారు. ఈ మేరకు ఫేక్ మస్టర్ల డబ్బుల్లో సగం స్థానిక పచ్చ నేతకు ఫీల్డ్ అసిస్టెంట్లు చెల్లిస్తున్నారు. అక్రమాలు వెలుగుచూసినా.. ఉన్నతాధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రూ. లక్ష వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.

ఉపాధిలో అవినీతి మస్టర్లు

ఉపాధిలో అవినీతి మస్టర్లు

ఉపాధిలో అవినీతి మస్టర్లు