
హైర్ బస్సు డ్రైవర్ల నిరసన
చీరాల అర్బన్: ఆర్టీసీ డిపోలో ఆన్‌కాల్ రిక్రూట్‌మెంట్‌లో హైర్ బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం డిపోలోని హైర్ బస్సుల డ్రైవర్లు నిరసన తెలిపారు. హైర్ బస్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు నిలిపివేసి నిరసన చేపట్టారు. సీఐటీయూ కార్యదర్శి ఎం.వసంతరావు మాట్లాడుతూ చీరాల డిపోలో 40 హైర్ బస్సులు నడుస్తున్నాయని, వీటిని నమ్ముకొని 90 మంది డ్రైవర్లు గత 15 సంవత్సరాలుగా ఆన్‌కాల్ విధుల్లో కొనసాగుతున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన ఆన్‌కాల్ రిక్రూట్‌మెంట్‌లో హైర్ బస్సుల డ్రైవర్ల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త వ్యక్తులను ఎంపిక చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర డిపోల్లో హైర్ బస్ డ్రైవర్లకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంటే చీరాలలో మాత్రం అందుకు భిన్నంగా చేస్తున్నారన్నారు. సమస్య పరిష్కరించకుంటే సమ్మె చేస్తామన్నారు. డ్రైవర్ల మెరుపు సమ్మె కారణంగా బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
పశ్చిమ డెల్టాకు 6,830 క్యూసెక్కులు విడుదల
దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి శుక్రవారం 6,830 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 290 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1,725, తూర్పు కాలువ 688, పశ్చివ కాలువ266, నిజాంపట్నం కాలువ 490, కొమ్మూరు కాలువకు 2,640 క్యూసెక్కులు విడుదల చేశారు. 1,89,625 క్యూసెక్కులు సముద్రంలోకి పంపుతున్నారు.
బస్సులు నిలిపివేసి నినాదాలు