
కృష్ణమ్మకు పోటెత్తిన వరద
కొల్లూరు : కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు సముద్రంలోకి నీటిని విడుదల చేయడంతో మండలంలోని కృష్ణా నది జలకళను సంతరించుకొంది. బుధవారం 87 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయగా... పైనుంచి వరద నీరు అధికంగా వచ్చి చేరుతుండటంతో గురువారం మధ్యాహ్నానికి క్రమంగా నీటి విడుదల స్థాయిని పెంచుతూ 2.61 లక్షల క్యూసెక్కులకు పెంచడంతో నీటిని సముద్రంలోకి వదిలారు. నదిలో నీటి ఉద్ధృతి పెరగడంతో మండలంలోని పెసర్లంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి ద్వారా వరద నీరు లోతట్టు ప్రాంతాలలోకి పరవళ్లు తొక్కుతూ చొచ్చుకొని పోతోంది. నీటి ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా నక్కపాయ ప్రాంతంలో కొల్లూరు కరకట్ట దిగువున ఉన్న లోతట్టు పంట పొలాలతోపాటు ఇటుక బట్టీలలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. అయితే ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వస్తున్న వరద నీరు క్రమక్రమంగా తగ్గుతుండటంతో ఆర్‌సీ అధికారులు శుక్రవారం సాయంత్రానికి నీటి విడుదల పరిమాణాన్ని తగ్గించి 2.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న వరదల కారణంగా ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో నదీ తీర ప్రాంత ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరదల తీవ్రత అధికమైతే పంటలను కోల్పోతామన్న ఆందోళనకు గురైన రైతాంగంలో నీటి విడుదల తగ్గుతుండటంతో ఆనందం వ్యక్తం అవుతోంది.
లోతట్టు ప్రాంతాలలోకి చేరుతున్న నీరు
ప్రకాశం బ్యారేజ్ నుంచి 2.61 లక్షల క్యూసెక్కులు విడుదల
క్రమంగా తగ్గుతున్న వరద నీటి విడుదల

కృష్ణమ్మకు పోటెత్తిన వరద