
14 నుంచి మహాకుంభాభిషేక ఉత్సవాలు
అద్దంకి రూరల్: పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం నూతన రాతిముఖ మండపంతో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుంది. దేవస్థాన ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ మదమంచి తిమ్మనాయుడు తెలిపారు.
రూ.6.83 కోట్లతో
నూతన రాతి ముఖమండపం, ఆలయం
శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థాన ముఖ మండపం జీర్ణావస్థకు చేరటంతో 2020లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ దేవస్థాన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చొరవతో నూతన రాతి ముఖమండపం నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.3 కోట్లు మంజూరు చేశారు. దానికి తోడుగా సీజీఎఫ్ ఫండ్స్ రూ.2 కోట్లు, మిగిలినవి దేవస్థానం, భక్తులు, దాతలు అందించిన సహకారంతో రూ.6.83 కోట్లతో పూర్తి రాతి ముఖమండపంతో ఆలయ నిర్మాణం పూర్తి అయింది.
కార్యక్రమాలు ఇలా..
నూతన రాతిముఖ మండపంతో ఆలయ నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ఈనెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మహాకుంభాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. 14వ తేదీ నుంచి శృంగేరి శారదా పీఠాధిపతి శ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామి బృందంచే విశేషపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 19న స్వామిజీ ఆధ్వర్యంలో కుంభాభిషేకం అనంతరం జీవ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయనున్నారు.
13న కలశయాత్ర
ప్రసన్నాంజనేయ స్వామి మహాకుంభాభిషేకంలో భాగంగా ఈనెల 13న ఉదయం 5 గంటలకు అద్దంకి పట్టణంలోని గుండ్లకమ్మ నది నుంచి 1200 మంది మహిళలు కలశాలతో జలాలను సేకరించి గజసహిత మంగళ వాయిద్యాలతో శింగరకొండ దేవస్థానం వరకు కలశయాత్ర నిర్వహించనున్నారు.
50 వేలమందికి పైగా భక్తులు
తరలివస్తారని అంచనా
మహాకుంభాభిషేకం, జీవధ్వజ స్తంభ ప్రతిష్టకు శింగరకొండ గ్రామ పరిసర గ్రామాల ప్రజలతోపాటు పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలోని భక్తులు కూడా భారీ తరలివచ్చే అవకాశం ఉంది. కార్యక్రమానికి సుమారు 50 వేల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవస్థాన అధికారులు భావిస్తున్నారు.
భారీగా ఏర్పాట్లు
కుంభాభిషేకం, ధ్వజస్తంభ ప్రతిష్టకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా భోజన వసతి, తాగునీరు, సేద తీరేందుకు చలువ పందిళ్లు, వసతి సౌకర్యాలు, మజ్జిగ పంపిణీ భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీగా ఏర్పాట్లు చేపట్టారు.
శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర
భారతీ స్వామి పర్యవేక్షణలో కార్యక్రమాలు

14 నుంచి మహాకుంభాభిషేక ఉత్సవాలు