
ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు
ప్రయాణికులకు తప్పిన పెనుప్రమాదం
రేపల్లె: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగిన సంఘటన చెరుకుపల్లిలో చోటుచేసుకుంది. రేపల్లె డిపోకు చెందిన ఏపీ 07జడ్ 0492 నంబరు ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి రేపల్లె వస్తున్న సమయంలో శనివారం మధ్యాహ్నం చెరుకుపల్లిలో ఆగింది. ప్రయాణికులు బస్సు ఎక్కి దిగే సమయంలో గేరు బాక్స్ వద్ద ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు ఎగసిపడ్డాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి దిగి పరుగులు దీశారు. స్పందించిన డ్రైవర్, కండెక్టర్‌లతోపాటు స్థానికులు ఇసుకను పోసి మంటలు అదుపు చేశారు. సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవటంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సైనికుల సహాయనిధికి రూ.5 లక్షల విరాళం
ఎస్పీకి చెక్కు అందజేసిన
చీరాలకు చెందిన ఎన్‌ఆర్‌ఐ
బాపట్లటౌన్: ప్రస్తుతం దేశంలో నెలకొని పరిస్థితుల దృష్ట్యా భారత సైనికుల సహాయనిధికి చీరాల పట్టణానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ రూ.5 లక్షల చెక్కును శనివారం ఎస్పీ తుషార్ డూడీకి అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ భారత సైనికులు దేశ భద్రత కోసం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారన్నారు. వారిని గౌరవించడమే కాదు, ఇటువంటి విపత్కర సమయాల్లో సాయంగా నిలవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. బాపట్ల జిల్లాకు చెందిన ఎన్‌ఆర్‌ఐ చూపిన ఉదారత అభినందనీయమన్నారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ దేశానికి సేవ చేయాలనే తపన వారి చర్యలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇలాంటి విరాళాలు అందించేవారు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి సారించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ తుషార్‌డూడీ
బాపట్లటౌన్: శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. డీజీపీ ఆదేశాల మేరకు దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ తుషార్ డూడీ మాట్లాడుతూ సీసీ కెమెరాల ద్వారా బోర్డర్ చెక్ పోస్టులను పరిశీలించాలన్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో నేరాలు అధికంగా జరగటానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడం, జిల్లాలతో ఉన్న సరిహద్దు ప్రాంతాలు, జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో నాకాబంది, వాహనాలు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. గంజాయి వినియోగించే వారు, అమ్మే వారి మీద నిఘా, పోలీస్ సిబ్బంది సంక్షేమం వంటి విషయాలపై చర్చించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ప్రజలకు సేవలందించుటకు సంసిద్ధంగా ఉండాలన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులు కానీ, వ్యక్తులు కానీ గమనిస్తే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు, 100/112 నంబర్‌కి కానీ ఫోన్ చేసి సమాచారం తెలియపరచాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
మల్లేశ్వరస్వామి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
పెదకాకాని: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు దంపతులు శనివారం పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వరసామి ఆలయానికి విచ్చేశారు. న్యాయమూర్తి దంపతులకు ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, అర్చక స్వాములు, వేదపండితు లు వేద మంత్రోచ్ఛారణల నడుమ మేళతాళా లతో సాదర స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన వారు భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకం, కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అర్చకస్వాములు, వేదపండితులు వేద ఆశ్వీరవచనం అందించారు. న్యాయమూర్తి దంపతులను స్వామి వారి శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి చిత్రపటం, ప్రసాదములను డీసీ అందజేశారు.

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు