
స్టాల్స్‌లో డ్రోన్ టెక్నాలజీని తెలుసుకుంటున్న విద్యార్థినులు
గుంటూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమానికి కృషిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగర శివారుల్లోని లాంఫాం నందున్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్రిటెక్–2023 వ్యవసాయ సాంకేతిక సదస్సు రెండవ రోజు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాలు తీర్చేందుకు ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు అవసరమైన వ్యవసాయానికి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, అందించటంతోపాటు ఎప్పటికప్పుడు వ్యవసాయ సాంకేతికతను రైతులకు అందిస్తూ ఆధునిక వ్యవసాయాన్ని రైతులకు చేరువ చేస్తుందన్నారు. రైతు పండించే పంటను వారికి తగిన ధర వచ్చేవరకూ నిల్వ చేసుకునేందుకు వీలుగా గోడౌన్స్ నిర్మించి అందుబాటులోకి తెచ్చిందన్నారు. సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులకు ప్రభుత్వపరంగా కొంత అధిక ధర చెల్లించటం ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. సేంద్రియ ఉత్పత్తులను గుర్తించేందుకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీదేవి మాట్లాడుతూ రైతుల అభివృద్ధికి విశ్వవిద్యాలయం ఎన్నో రకాల నూతన వంగడాలను అందించిందన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎ.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ రైతుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అధునాతన వ్యవసాయాన్ని అందించేందుకు శాస్త్రవేత్తలు ఆర్‌బీకేల ద్వారా అందుబాటులో ఉన్నారన్నారు. శైలజరెడ్డి కుంకుమ పువ్వు పెంపకం గురించి వివరిస్తూ మన వాతావరణంలో ఏవిధంగా పెంచాలో వివరించారు. అనంతపురం రైతు మురళీకృష్ణ తమ జిల్లాలో చేపల పెంపకం చేసి ఏవిధంగా విజయం సాదించాడో వివరించారు. రైతు సాయికృష్ణ డ్రోన్‌లతో పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు వెదజల్లటం వంటి కార్యక్రమాలతో ఏవిధంగా కూలీల బెడద, ఖర్చులు తగ్గింపు వివరాలు తెలిపారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.నారంనాయుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధన దిశగా చేపడుతున్న పరిశోధనలు వివరించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ ఎల్.ప్రశాంతి, డాక్టర్ అనూషలు కొబ్బరిలో సమస్యాత్మకంగా మారిన నల్లి, సర్పిలకార తెల్లదోమ యాజమాన్యం గురించి వివరించారు. మిర్చి పంటలో నల్లతామర పురగు నివారణ గురించి డాక్టర్ శిరీష తెలిపారు. పాల దిగుబడి లేగదూడల పెంపకం గురించి డాక్టర్ ముత్తారావు వివరించారు. సేంద్రియ రైతు ఆరుమల్ల సాంబిరెడ్డి సేంద్రియ వ్యవసాయం యాజమాన్య పద్ధతులు అనుభవాలను చెప్పారు. అనంతరం రైతులతో శాస్త్రవేత్తలు ముఖాముఖి నిర్వహించారు. ఏర్పాటు చేసి స్టాల్స్ రైతులను ఆకట్టుకున్నాయి. సదస్సులో రైతులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి రెండవ రోజు కొనసాగిన అగ్రిటెక్–2023 సదస్సు
