పుంగనూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరెండున్నరేళ్ల కాలంలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేశారని, మిగిలిన కాలానికి మరో రూ.6లక్షల కోట్లు అప్పు చేసి రూ.10 లక్షల కోట్లు ప్రజలపై అప్పు పెడతారని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2029లో జరిగే ఎన్నికల్లో వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. పేద ప్రజల ఖాతాలకు డబ్బులు వేసిన ఘనత జగన్‌దేనని పేర్కొన్నారు. సోమవారం తన నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హనుమంతరాయునిదిన్నెలో గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, సయ్యద్‌నూర్‌షావలిబాబా దర్గాలో ప్రార్థనలు చేసి ప్రారంభించారు. అక్కడ జరిగిన సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్–6 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నేరవేర్చలేదని మండిపడ్డారు. అమరావతి పేరుతో ఇప్పటికే రూ.4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడైన ఒక్కరూపాయి ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశారా అంటు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ప్రజల వద్ద ఓట్లు వేసుకున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగిస్తున్నాడని తూర్పారబట్టారు. ఎన్నికల కోసం డ్రామాలు వేస్తున్నాడని మండిపడ్డారు. పడమటి నియోజకవర్గాలకు తాగు, సాగునీరు అందించేందుకు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంచినీటి ప్రాజెక్టులు మంజూరు చేశారని తెలిపారు. ఆ ప్రాజెక్టులను పూర్తికాకుండా అడ్డుకున్న ఘనత చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. హెచ్‌ఎన్‌ఎస్ కాలువ ద్వారా నీరు వెళ్తున్న మదనపల్లె, పుంగనూరు చెరువులకు, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకులకు నీరు వదలకుండా ఈ ప్రాంత వాసులపై కక్షసాధింపు ధోరణితో పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. కరోనాలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి సేవలు చేయడంతో పాటు, పేదలందరికీ నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి ఆదుకుందని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనించి, స్థానిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డి, కొండవీటి నాగభూషణం, వెంకటరెడ్డి యాదవ్, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, పృథ్వీధర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్ షరీఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ అమ్ము తదితరులు పాల్గొన్నారు.
కూటమి ఎన్నికల ‘సూపర్–6’ పత్తాలేదు
అమరావతి ఒక్కటే అభివృద్ధి కాదు
పేదల ఖాతాలకు డబ్బులు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దే
వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


