● కలెక్టరేట్‌కు పొటెత్తిన బాధితులు..
● పీజీఆర్‌ఎస్‌కు వినతుల సమర్పణ..
● క్షేత్రస్థాయిలో చర్యలు శూన్యం
మదనపల్లె (కురబలకోట): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) అంటే అర్జీదారుల ప్రదక్షిణలా.. లేక సమస్యల పరిష్కారమా? అన్న అనుమానాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ప్రతి వారంలాగే ఈ సోమవారం కూడా జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అర్జీదారులు పొటెత్తారు. భూసమస్యలు, రీసర్వే అవకతవకలు, పింఛన్లు తదితర ఇబ్బందులపై పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లబ్ ద్వారా మొత్తం 433 దాకా అర్జీలు వచ్చాయి. అయితే కేవలం అర్జీల సంఖ్యతో పనిలేదు.. వాటికి శాశ్వత పరిష్కారాలు చూపడమే ముఖ్యమని బాధితులు ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే సమస్యపై మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తగ్గితేనే ఈ వేదిక లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేస్తున్నారు. పాత సీసాలో కొత్త సారా అన్నట్లుగా.. గతంలో ఇచ్చిన పాత సమస్యలకే మళ్లీ మళ్లీ అర్జీలు సమర్పించాల్సి రావడం పట్ల విచారం వ్యక్తమవుతోంది. సమస్యల పురోగతిని పర్యవేక్షించడం, గడువులోగా పరిష్కారం చూపి అర్జీదారులకు సంతృప్తిని కలిగించడం అత్యంత ముఖ్యమని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. అర్జీల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
భూముల విలువ తగ్గించాలి:
కోటవారిపల్లిలో 40 ఎకరాల భూములకు ఎకరాకు రూ.65 లక్షల ప్రభుత్వ విలువ కట్టారని, క్షేత్రస్థాయి లో అంత రేటు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులే రూ.4 లక్షలు అవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
రీసర్వే తప్పులు:
బండమీదపల్లి రైతు వై. నరసింహారెడ్డి తనకు పక్కా రికార్డులు ఉన్నా రీసర్వేలో 45 సెంట్ల భూమి తక్కువగా నమోదైందని ఫిర్యాదు చేశారు.
రైతాంగ సమస్యలు:
పాడి రైతులు, గొర్రెల పెంపకందారుల సమస్యలు తీర్చాలని, పశుసంవర్ధక శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.
పాసుబుక్కులో అన్నీ తప్పులే:
కురబలకోట మండలం మట్లివారిపల్లికి చెందిన వై. వెంకటరమణ నాయుడుకు ఇచ్చిన రీసర్వే పాసుబుక్కులో ఫొటో, తండ్రి పేరు, సర్వే నంబర్లు, విస్తీర్ణంతో పాటు చివరకు కులం కూడా తప్పుగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.


