ఖాకీల ట్రాక్టర్‌ దగా | - | Sakshi
Sakshi News home page

ఖాకీల ట్రాక్టర్‌ దగా

Oct 13 2026 1:29 AM | Updated on Oct 13 2026 1:29 AM

● రాజకీయ ఒత్తిళ్లతో విచారణకు బ్రేక్‌!

● 50కి పైగా వాహనాలు మాయం.. చూపింది 13 మాత్రమే

రాయచోటి: రైతన్నలను నమ్మించి, అద్దె పేరుతో వారి జీవితాధారమైన ట్రాక్టర్లను లాక్కొని సొమ్ము చేసుకున్న అంతర్రాష్ట్ర పోలీసు ముఠా అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా సంబేపల్లె పరిధిలో వెలుగుచూసిన ఈ భారీ కుంభకోణాన్ని కేవలం 13 ట్రాక్టర్ల రికవరీతోనే ముగించేందుకు తెరవెనుక ముమ్మర ప్రయత్నాలు జరుగుతుండటం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. ఈ భారీ స్కామ్‌లో 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకు దారిమళ్లినట్లు విచారణలో తేలింది. అయితే, ఈ అక్రమ సంపాదన ముఠాకు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు దొరికితే తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయంతో, అధికార పార్టీ నాయకులు పోలీసులపై తీవ్ర ఒత్తిడి తెచ్చి విచారణకు బ్రేకులు వేయించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే పోలీసులు కేవలం 13 ట్రాక్టర్లు, 5 ట్రాలీలను మాత్రమే రికవరీ చూపి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

సరిహద్దులు దాటిన నెట్‌వర్క్‌

ఈ ముఠా అవినీతి సామ్రాజ్యం ఒక్క అన్నమయ్య జిల్లాకే పరిమితం కాలేదు. వైఎస్సార్‌ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, గుంటూరు జిల్లాల వరకు పాకింది. నెలనెలా అద్దెలు ఇస్తామని నమ్మించి రైతుల నుంచి వాహనాలు తీసుకోవడం, వాటిని కర్ణాటక సరిహద్దుల్లో తక్కువ ధరలకు విక్రయించడం వీరి శైలి. ‘సాక్షి’ నిరంతరం కథనాలను ప్రచురిస్తూ బాధితుల పక్షాన నిలబడటంతో ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే అనంతపురం 14వ బెటాలియన్‌కు చెందిన ఏఆర్‌ ఎస్‌ఐ నెల్లిపల్లి చంద్రహాస్‌, కానిస్టేబుల్‌ సోమల ప్రతాప్‌ లపై విచారణ జరిపి వారిని సస్పెండ్‌ చేశారు. వీరితో పాటు వాసుదేవరెడ్డి, సుదీర్‌, నరేష్‌, విశ్వనాథ్‌ రెడ్డి తదితరులు ఈ దోపిడీలో భాగస్వాములుగా తేలారు.

రైతుల అద్దె డబ్బులూ స్వాహా!

ట్రాక్టర్లను విక్రయించిన ముఠా నుంచి రైతులకు అందాల్సిన నెలవారీ అద్దె బాకీలను కొంతమంది పోలీసులు లక్షలాది రూపాయల రూపంలో వసూలు చేశారని, కానీ ఆ సొమ్మును అసలైన బాధితులకు ఇవ్వకుండా తామే నొక్కేసారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వసూళ్ల ఆరోపణలపై రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్‌ స్పందిస్తూ.. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వాహనాలను రైతులకు అప్పగించే కార్యక్రమం చేపట్టామన్నారు. పోలీసులు అద్దె డబ్బులు వసూలు చేసిన విషయం తన దృష్టికి రాలేదని, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement