● మహబూబ్ జాన్ కన్నీటి గాథ
● చలించిన జాయింట్ కలెక్టర్
మదనపల్లె (కురబలకోట): ఆమెకు నోటి మాట రాదు.. కనీసం కూర్చోలేదు, లేవలేదు. ఒక ముద్ద నోట్లోకి వెళ్లాలన్నా, దైనందిన సపర్యలు జరగాలన్నా మరొకరు చేయి కలపాల్సిందే. అన్నమయ్య జిల్లా ములకలచెరువుకు చెందిన మహబూబ్ జాన్ (45) అనే మానసిక, శారీరక దివ్యాంగురాలి జీవితం ఒక నిశ్శబ్ద నరకం. కంటి ఐరిష్ రావడం లేదని, చేతివేలి ముద్రలు పడటం లేదని సాంకేతిక కారణాలు చెప్పి సిబ్బంది చేతులెత్తేయడంతో, 45 ఏళ్లుగా ఆమెకు ఆధార్ కార్డే లేదు. ఫలితంగా రేషన్ కార్డు, వికలత్వ సర్టిఫికెట్ రాక.. చట్టబద్ధంగా దక్కాల్సిన రూ. 15,000 వైద్య పింఛన్‌కు ఈ అభాగ్యురాలు దూరమైంది. బతుకే భారమైన ఆ పేద కుటుంబం రోజూ చస్తూ బతికింది. చివరి ప్రయత్నంగా కుటుంబీకులు రూ. 1,500 చెల్లించి మహబూబ్ జాన్‌ను ఆటోలో మదనపల్లె కలెక్టరేట్ ‘పీజీఆర్‌ఎస్’కు తీసుకొచ్చారు. ఆటోలో అచేతనంగా పడి ఉన్న ఆమె దుస్థితిని చూసి జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ చలించిపోయారు. నిబంధనల కంటే మానవత్వమే మిన్నగా భావించి, వెంటనే అధికారులను పిలిపించారు. ‘సాంకేతిక సాకులు చెప్పి ఇలాంటి వారిని రోడ్డున పడేస్తారా?’ అని ప్రశ్నిస్తూ.. ప్రత్యేక అధికారిక అథెంటికేషన్‌తో ఆమెకు వెనువెంటనే ఆధార్, రేషన్ కార్డులు మంజూరు చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు. జేసీ ఇచ్చిన ఆ ఒక్క ఆర్డర్.. 45 ఏళ్ల ఆ కుటుంబ చీకటిని చీల్చి, డిజిటల్ యుగంలో మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించింది.


