● జాబ్‌లు, ప్రభుత్వ పనుల పేరుతో మోసాలు
● అమాయకుల నుంచి
రూ. లక్షల్లో వసూళ్లు
మదనపల్లె టౌన్: ప్రభుత్వ ఉద్యోగాలు, పనులు చేయిస్తానని నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నకిలీ అధికారి షేక్ సయ్యద్ మీర్ (50) ను మదనపల్లె వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ ప్రసాద్, సీఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె గొల్లపల్లెకు చెందిన నిందితుడు తిరుపతికి మకాం మార్చి, తనను ‘నేర నిరోధక సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు’గా పరిచయం చేసుకునేవాడు. కారుపై బోర్డు, నకిలీ గుర్తింపు కార్డులతో తిరుగుతూ అమాయకులను నమ్మించేవాడు.బాధితుల నుంచి ఫోన్‌పే, బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.3.50 లక్షలకు పైగా వసూలు చేశాడు. డబ్బులు తిరిగి అడిగితే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. పీలేరు మార్గంలో వాహన తనిఖీలు చేస్తుండగా కారుతో పారిపోతుండగా పోలీసులు ఇతన్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి కారు, మూడు నకిలీ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. కాగా, జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ నిందితుడిపై మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఏడేళ్ల క్రితమే పీలేరు రేగళ్ళు కు చెందిన అల్లా భక్ష్ వద్ద రూ.5 లక్షలు, జాకీర్ హుస్సేన్ వద్ద రూ.7 లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని బాధితుల నుంచి మరికొన్ని ఫిర్యాదులు స్వీకరించి అసలు నమ్మొద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు కాదా సోమవారం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషనలోనూ సయ్యద్ మీర్ పై మరో చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


