రాయచోటి టౌన్,: లక్కిరెడ్డిపల్లె మండలంలో జరిగిన ఒక హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులకు మూడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ రాయచోటి సీనియర్ సివిల్ జడ్జి ఇ. ప్రసూన సోమవారం కీలక తీర్పు ఇచ్చారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. లక్కిరెడ్డిపల్లె మండలం చింతకుంటపల్లెకు చెందిన నల్లతిమ్మారెడ్డిగారి చంద్రశేఖర్ రెడ్డి 2022 జనవరి 28న సర్వే నంబర్ 1178 భూమిని జేసీబీతో చదును చేయిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నల్లతిమ్మారెడ్డి చెన్నారెడ్డి, పద్మారాణి, చంద్రశేఖర్ రెడ్డి, నరేష్‌కుమార్ రెడ్డిలు ఒక్కసారిగా కర్రలతో చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి లక్కిరెడ్డిపల్లె ఎస్‌ఐ వినోద్ కుమార్ క్రైమ్ నంబర్ 10/2022 కింద ఐపీసీ సెక్షన్లు 323, 324, 307, ఆర్/డబ్ల్యూ 34 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కోర్టులో సుదీర్ఘ వాదనల అనంతరం నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్ష ఖరారు చేశారు.ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. గుర్రప్ప వాదనలు వినిపించారు. నిందితులకు శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరించిన లక్కిరెడ్డిపల్లె సీఐ హెచ్. కృష్ణమరాజు, ఎస్‌ఐ జి. శోభలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


