ట్రాక్టర్ల మాయాజాలం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ల మాయాజాలం

Oct 8 2026 3:24 AM | Updated on Oct 8 2026 3:24 AM

● తవ్వుతున్న కొద్దీ ఖాకీల కుంభకోణం!

● అనంతపురం 14వ బెటాలియన్‌ పోలీసుల దగా..

● ఏఆర్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ గుట్టురట్టు!

రాయచోటి : శాంతిభద్రతలను కాపాడి, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన పోలీసులే దారి తప్పారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి ఏకంగా ’ఇంటి దొంగలు’గా మారారు. ఎర్రచందనం మాఫియాతో చేతులు కలిపి, అమాయక రైతులను నట్టేట ముంచిన అనంతపురం జిల్లా 14వ బెటాలియన్‌ పోలీసుల అక్రమ దందా ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. రైతుల నుంచి అద్దె ప్రాతిపదికన సేకరించిన ట్రాక్టర్లను అక్రమ రవాణాకు వాడుకుంటూ, ఆపై వాటిని మాయం చేస్తున్న ఓ పెద్ద కుంభకోణం విచారణలో బయటపడింది.

అద్దె పేరిట నమ్మకద్రోహం!

అనంతపురం జిల్లా పరిధిలోని 14వ బెటాలియన్‌లో పనిచేస్తున్న ఏపీఎస్‌పీ ఏఆర్‌ ఎస్‌ఐ చంద్రహాసన్‌ (సంబేపల్లి మండలం గున్నికుంట్ల), అదే బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్‌ ప్రతాప్‌ (లక్కిరెడ్డిపల్లి మండలం మద్దిరేవుల)లతో పాటు గున్నికుంట్లకు చెందిన సుధీర్‌ అనే వ్యక్తితో కలిసి ఈ అక్రమ నెట్‌వర్క్‌ నడుపుతున్నారు. రైతుల వద్ద నుంచి ’అద్దెకు ఇస్తే భారీగా డబ్బులు ఇస్తాం’ అని నమ్మబలికి ట్రాక్టర్లను తీసుకున్నారు. నెలలు గడుస్తున్నా అద్దె చెల్లించకపోగా, అసలు ఆ వాహనాలు ఎక్కడున్నాయో కూడా చెప్పకుండా తిరుగుతుండటంతో మోసపోయామని గ్రహించిన రైతులు రెండు నెలల క్రితం సంబేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు

ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో సంబేపల్లె పోలీసులు రంగంలోకి దిగి సదరు ఏఆర్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన ఈ ఇద్దరు పోలీసులను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వీరు కేవలం అన్నమయ్య జిల్లాలోనే కాకుండా వైఎస్‌ఆర్‌ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సైతం రైతుల నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్లను అద్దె పేరుతో సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ట్రాక్టర్లను ఎర్రచందనం మాఫియాకు అప్పగించి, అక్రమ రవాణాకు వాడుకోవడమే కాకుండా, కొన్నింటిని గుంటూరు జిల్లా పరిధిలో విక్రయించినట్లు విచారణలో తేలింది.

పోలీసులపై అధికార పార్టీ ఒత్తిళ్లు..

ప్రస్తుతం సంబేపల్లి పోలీసులు ఇప్పటివరకు 10 ట్రాక్టర్లను గుర్తించి స్వాధీనం చేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే, ఈ కేసులో లోతుగా విచారణ జరిపితే దాదాపు 100కు పైగా ట్రాక్టర్ల స్కామ్‌ బయటపడే అవకాశం ఉందని, పలువురు ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతల పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్‌ ఉందని టాక్‌ వినిపిస్తోంది. దీంతో కేసును నీరుగార్చేందుకు, నిందితులైన పోలీసులను రక్షించేందుకు జిల్లా అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు పోలీసులపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. లక్షల రూపాయలు అప్పులు చేసి ట్రాక్టర్లు కొనుక్కొని రోడ్డున పడ్డ రైతులకు న్యాయం చేయాల్సింది పోయి, దొంగలకు అధికార పార్టీ నేతలు అండగా నిలవడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం

ఈ సంచలన కేసుపై రాయచోటి రూరల్‌ సీఐ రోషన్‌ స్పందిస్తూ.. పోలీస్‌ వృత్తిలో ఉంటూ రైతులను మోసం చేసిన ముఠాపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటివరకు 10 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన వాహనాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. త్వరలోనే కేసు పూర్తి వివరాలను, పట్టుబడిన నిందితుల సమాచారాన్ని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మీడియాకు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement