పెద్దతిప్పసముద్రం : స్థానిక అంకిరెడ్డిపల్లి రోడ్డులోని ఏటి వద్ద మలుపులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పీటీఎంకు చెందిన కుంచి శ్రీరాములు (62) తన వ్యవసాయ పొలంలోని టెంకాయలను సూపర్ ఎక్సెల్‌లో పెట్టుకుని ఇంటికి వస్తుండగా, రంగసముద్రం పంచాయతీ విసనకర్రవాండ్లపల్లికి చెందిన మనోహర్ (28) అంకిరెడ్డిపల్లి నుంచి ద్విచక్ర వాహనంలో వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకున్నాడు. ఈ ఘటనలో కుంచి శ్రీరాములు ఎడమ కాలు విరిగింది. మనోహర్ తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
నూనె పెన్నంలో పడి వంట మాస్టర్‌కు..
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : వ్యాపార అవసరాలకు మురుకులు నిప్పట్లను పెన్నంలో వేసి నూనెలో కాల్చుతుండగా వంట మాస్టర్ ప్రమాదవశాత్తు అందులో పడి కాలి తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం సాయంత్రం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పిట్టావాండ్లపల్లె క్రాస్ రోడ్డులో కాపురం ఉంటున్న కృష్ణయ్య కొడుకు రమేష్ (42), మురుకులు నిప్పట్లు తయారుచేసి విక్రయించి జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం ఇంటి ఆవరణలో మురుకులు, నిప్పట్లు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు పెన్నంలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు బాధితుడిని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై నిమ్మనపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్కూటర్ ఢీకొని..
మదనపల్లె టౌన్ : స్కూటర్ ఢీకొని మహిళ తీవ్రంగా గాయపడి సంఘటన బుధవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమండ్యం మండలం, బండ కింద తండాకు చెందిన పద్మావతి (55) సొంత పనిమీద కొటాలలోని బంధువులు ఇంటికి వచ్చింది. తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డు పక్కన వేసి ఉండగా ఓ స్కూటర్ వేగంగా వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స అనంతరం రుయాకు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తంబళ్లపల్లె పోలీసులు తెలిపారు.


