పట్టాలిచ్చారు.. స్థలాలు చూపండి! | - | Sakshi
Sakshi News home page

పట్టాలిచ్చారు.. స్థలాలు చూపండి!

Oct 8 2026 3:24 AM | Updated on Oct 8 2026 3:24 AM

సాక్షి, మదనపల్లె : వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాకందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, స్థలాలు కేటాయించారు, వాటిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ మహిళలు వైఎస్సార్‌సీపీ, సీపీఐ ఆధ్వర్యంలో బి.కొత్తకోట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నగర పంచాయతీకి చెందిన మహిళలు వెయ్యి మందికి పైగా పట్టాలు పొందారు. అధికారం మారడంతో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను చూపించలేదు. దాంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. రెండేళ్లుగా స్థలాల కోసం ఎదురుచూస్తున్నామని పట్టాలు పొందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పాగొండ ఖలీల్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి 1,500 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారన్నారు. వీరికి కేటాయించిన స్థలాలను అప్పగించాలని ఎమ్మెల్యే పలుమార్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. దీనిపై కలెక్టర్‌ ద్వారా స్థలాలు అప్పగించేలా కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మారకపోయి ఉంటే ఇప్పటికే లబ్ధిదారులు తమ సొంత ఇళ్లలో ఉండేవారని అన్నారు. స్థలాలు చూపించేందుకు కలెక్టర్‌ ఎమ్మెల్యే కు హామీ ఇచ్చినట్టు ఆయన అన్నారు. పేదలకు న్యాయం జరిగేదాకా ఉద్యమిస్తామని అన్నారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌ రెడ్డి మాట్లాడుతూ పట్టాలు పొందిన పేదలు ఆన్‌లైన్‌లో ఇప్పటికే నమోదు అయ్యారని అన్నారు. తిరిగి కొత్తగా స్థలాలకు, పక్కా ఇంటికి మంజూరు పొందలేని పరిస్థితి వచ్చింది అన్నారు. ఈ పరిస్థితిపై అధికారులు స్పందించి పేదలకు సహకరించాలని విన్నవించారు. అనంతరం తహసీల్దార్‌ బావాజాన్‌ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యపై ఆయన మాట్లాడుతూ దీనిపై సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అని, పేదలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నారని, మరో మారు సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి స్థలాల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శివ, అయూబ్‌, చిన్నికృష్ణ, తరిగోడు బయ్యారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి, గుమ్మడికాయల చాంద్‌బాషా, తబ్బు, రమేష్‌రెడ్డి, నాయనబావి జీవీ, అష్రఫల్లీ, బషీర్‌ఖాన్‌, రఘనాధ్‌, సమీవుల్లా, తంబయ్యశెట్టి, దుమ్ముబాబు, గంగులప్ప, సుధాకర్‌, సింగన్న, సాబు, వెంకటరెడ్డి, సాయి, మహిళలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ, సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement