టాస్క్‌ఫోర్స్ : అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో ఉపాధి హామీ పథకంలో ఇష్టానుసారంగా.. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో పనులు చేస్తూ కూలీల పొట్టకొడుతున్నారు. పలు అక్రమాలపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి గతనెల 4న విబిజీరామ్ పథకం కేంద్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. సదుం మండలంలోని తాటిగుంటపాలెం, పాపిరెడ్డిగారిపల్లెలో పనులు చేయకుండానే బిల్లులు డ్రాచేసి స్వాహా చేశారని పేర్కొన్నారు. రైతులకు తెలియకుండానే ఎఫ్‌ఏ నవీన్‌కుమార్ మామిడి పెంపకం తోటలకు మంజూరయ్యే బిల్లులు డ్రా చేసుకొని స్వాహా చేశారని, అధికారులు, నేతల అండదండలతో సిబ్బంది ఇష్టానుసారంగా గతంలో చేపట్టిన పనులకు మళ్లీ బిల్లులు రికార్డుచేసి బోగస్ మస్టర్లతో స్వాహా చేస్తున్నారని ఎంపీ ఫిర్యాదుచేశారు.స్పందించిన కేంద్ర కార్యదర్శి విజిలెన్స్ బృందం బుధవారం సదుం మండలానికి చేరుకుంది, పనులను రికార్డుల ఆధారంగా క్షేఽత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు తెలియకుండా బిల్లులు స్వాహా చేశారని నిర్థారించినట్లు సమాచారం. కూలీలకు పనులు కేటాయించకపోగా యంత్రాలతో పనులు చేయడం ఏమిటని పశ్నించారు. నిబంధనలు పాటించకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనంతరం మండలంలోని తిమ్మనాయునిపల్లె, అమ్మగారిపల్లె, గొంగివారిపల్లె గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించారు. కాగా విచారణలో వెలుగుచూసిన అక్రమాలను బృందం వివరించకపోగా వారిపేర్లను సైతం తెలపలేదు. నివేదికలను కేంద్ర ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.


