వస్తున్నారు..అర్జీలు ఇస్తున్నారు..వెళ్తున్నారు..!! | - | Sakshi
Sakshi News home page

వస్తున్నారు..అర్జీలు ఇస్తున్నారు..వెళ్తున్నారు..!!

Oct 6 2026 1:30 AM | Updated on Oct 6 2026 1:30 AM

● పరిష్కారం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే

● ప్రహసనంగా మారిన పీజీఆర్‌ఎస్‌

మదనపల్లి (కురబలకోట) : ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటికి సత్వర పరిష్కారం చుపాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం ఇప్పుడు అర్జీల స్వీకరణకే పరిమితం అవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు వివిధ సమస్యలతో వస్తన్నారు. అర్జీలు ఇస్తున్నారు. అధికారులు వింటున్నారు.. ఆశతో తిరిగి వెళ్తున్నారు.. చివరకు పరిష్కారం కాక మరోసారి రావాల్సిన పరిస్థితి వస్తోందని పలువురు వాపోతున్నారు. రెవెన్యూ క్లీనిక్‌ అర్జీలు కూడా పరిష్కారానికి నోచుకోవడం లేదని మదనపడుతున్నారు. అర్జీలు ఇవ్వడం తప్ప పరిష్కారానికి దిక్కులేదని తిరిగి తిరిగి కాళ్లు నొప్పులు మాత్రం వస్తున్నాయని వ్యధ చెందుతున్నారు.

సోమవారం మదనపల్లి జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 337 మంది అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ శర్మ, సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి తదితరులు అర్జీలు స్వీకరించారు. వచ్చిన అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అలసత్వం ఉండరాదన్నారు.

అన్నమయ్య జిల్లా పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాంతీయ వైద్య శాలల్లో శానిటేషన్‌,వెస్ట్‌ కంట్రోల్‌, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్రంలో ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోపనిచేస్తున్న 14600 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఎఫీ మెడికల్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ జేఎసీ నాయకులు కోరారు. 16 ఏళ్లుగా రెగ్యులర్‌ నియమకాలు జరగకపోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నామని పీజీఆర్‌ఎస్‌లో విన్నవించారు.

దౌర్జన్యంగా ఎకరం భూమి కబ్జా చేశారు

దౌర్జన్యంగా ఎకరం భూమి కబ్జా చేసి అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారని అడిగితే బెదిరిస్తున్నారని తనకు న్యాయం చేయాలని కురబలకోట మండలం చిన్నతట్టివారిపల్లికి చెందిన కుంచె శ్రీనివాసుళు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నందిరెడ్డిగ్రామ పరిధిలోని తమ గ్రామం వద్ద వారసత్వంగా వచ్చిన భూమి విషయమై ఏడాదికి పైగా వివాదం నడుస్తోందన్నారు. సర్వే నెంబరు 139లో తనకు ఎకరం భూమి రావాల్సి ఉందన్నారు. కతమంపల్లికి చెందిన వెంకటా చలపతి, రవీంద్ర, రామకృష్ణ దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. రికార్డులు పరిశీలించి ఆపై సమగ్రంగా విచారించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. తగు చర్యలు తీసుకోవాల్సింగా స్థానిక రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా సర్కారుతోపు దగ్గర నందిరెడ్డిగారిపల్లికి చెందిన షామీర్‌ కూడా ఇక్కడి భూమి విషయమై ఫిర్యాదు చేశారు.

మదనపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను తొలగించాలి

మదనపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జంగాల శివరామ్‌ను పదవి నుండి తొలగించాలని బహుజన సమాజ్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఇతని నియామకం కోసం తప్పుడు దృవ పత్రాలు ఇచ్చారని ఆపై కేసులు ఉన్నా ఎలాంటి కోర్టు కేసులు లేవని దృవీకరణ పత్రం ఇచ్చారన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రిజర్వేషన్‌ కూడా తారుమారు చేశారని ఆరోపించారు. వీటిపై విచారణ జరిపి ఆయన్ను పదవి నుండి తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

బోయకొండ ఈఓను సస్పెండ్‌ చేయాలి

బోయకొండ గంగమ్మ దేవస్థానంలో టెండర్‌ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు పీజీఆర్‌ఎస్‌లో ఓ వెంకట యాదవ్‌ తదితరులు వినతిపత్రం ఇచ్చారు. టెండర్‌ ప్రక్రియ పూర్తికాక ముందే పనులు చేపట్టడం, టెండర్‌ దారుడిపై దాడి జగగడం వంటి అంశాలపై విచారణ జరపాలన్నారు. టెండర్‌ నోటిఫికేషన్‌, వర్క్‌ ఆర్డర్లు, ఎంబీ రికార్డులు, బిల్లుల చెల్లింపులు పరిశీలించాలన్నారు.ప్రత్యేక కమిటీతో విచారణ జరిపి ఈఓను సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement