యూరియా కోసం రైతుల పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

యూరియా కోసం రైతుల పడిగాపులు

Oct 6 2026 1:00 AM | Updated on Oct 6 2026 1:00 AM

గుర్రంకొండ : యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. యూరియా స్టాకు వచ్చి 12 రోజులు గడుస్తున్నా అధికారులు పంపిణీ చేయకపోవడంతో రైతులు ఆర్‌ఎస్‌కేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మండలంలోని మర్రిపాడు, రామాపురం గ్రామాల్లో ఈ సమస్య నెలకొంది. మండలంలోని మర్రిపాడు, రామాపురం ఆర్‌ఎస్‌కేలకు 12 రోజుల క్రితం యూరియా స్టాకు వచ్చింది. దీంతో రైతులు ఆర్‌ఎస్‌కేల వద్దకు పరుగుల తీశారు. అయితే ఆన్‌లైన్‌ పనిచేయడం లేదని కొన్ని రోజులు, వేలిముద్రలు రావడం లేదని కొన్ని రోజులు, మదనపల్లెలో సీఎం సభ ఉందని కొన్ని రోజులు యూరియా పంపిణీ చేయలేదు. విషయం తెలియని రైతులు ప్రతి రోజూ తమ రోజు వారీ వ్యవసాయ పనులు మానుకొని ఆర్‌ఎస్‌కేల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఎల్‌నినో కారణంగా పంటలు సాగు చేసుకోలేక పాడి ఆవులపైనే రైతులు ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాలు కురవక పశుగ్రాసం లభించక పశులకు మేత కోసం గడ్డి, జొన్న, మొక్కజొన్నలు ఆక్కడక్కడ సాగు చేసుకున్నారు. ఇందుకు అవసరమైన యూరియా కొసం నానా కష్టాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రామాపురం రైతు సేవా కేంద్రం వద్దకు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. అప్పుడే అక్కడికి చేరుకున్న వ్యవసాయ సిబ్బందిని రైతులు యూరియా విషయమై ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో సాంకేతిక లోపాల కారణంగా ఈ రోజు కూడా యూరియా పంపిణీ చేయలేమని సమాధాన మిచ్చారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎన్ని రోజులు ఇలా సమాధానమిస్తారు, రోజుల తరబడి పనులు మానుకొని మీ చుట్టూ తిరగాలంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్‌బాబు అక్కడి చేరుకొని రైతుల తరఫున ఆధికారులను ప్రశ్నించారు. యూరియా కోసం వచ్చే రైతులను ఇలా రోజుల తరబడి తిప్పుకోవడం తగదన్నారు. యూరియా పంపిణీ చేయకపోతే గుర్రంకొండలో పాడి రైతులతో కలసి ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో నెలకొన్న లోపాల కారణంగా తాము ఏమి చేయలేమని వ్యవసాయశాఖ సిబ్బంది చేతులెత్తేశారు.

12 రోజులుగా ఆర్‌ఎస్‌కేల చుట్టూ ప్రదక్షిణలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement