● శ్రీ సత్యసాయి జిల్లా వాసుల దౌర్జన్యం
● జేసీబీలతో చదును, రిగ్గులతో డ్రిల్లింగ్
● కబ్జా వ్యవహారంపై పీజీఆర్‌ఎస్‌లో రైతుల ఫిర్యాదు
పెద్దతిప్పసముద్రం : ఇటు కర్ణాటక, అటు శ్రీ సత్యసాయి జిల్లా సరిహద్దులో పీటీఎం మండలం ఉంది. మండలంలోని పట్టెంవాండ్లపల్లి పంచాయతీ వడ్డిపల్లి సమీపంలో ప్రభుత్వ భూమికి ఈ ప్రాంతవాసులు గోశాల గుట్టగా నామకరణం చేశారు. సుమారు 10 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఇక్కడ ఉంది.
ఈ భూమి పక్కనే శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎరబల్లికి చెందిన రైతుల పట్టా భూములు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వ భూమిపై శ్రీ సత్యసాయి జిల్లా ఎరబల్లికి చెందిన కొందరు అక్రమార్కులు ఈ భూమిపై కన్నేశారు. భూమికి సంబంధించి తమ వద్ద పట్టాలు ఉన్నాయని, చుట్టు పక్కల రైతులను నమ్మించారు. అక్రమార్కులకు ఎవరి అండదండలు పుష్కలంగా ఉన్నాయో మూడు రోజులుగా ప్రభుత్వ భూమిలో రిగ్గు ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాలను దింపారు. యంత్రాలతో పట్టపగలు దర్జాగా ప్రభుత్వ భూములను చదును చేస్తున్నా, గుట్టలోని బండ రాళ్లను తొలగిస్తున్నా పట్టించుకునే కరువయ్యారు. గుట్టల నుంచి తొలగించిన బండ రాళ్లు, మట్టిని పక్కనున్న పట్టా భూముల్లో పడేశారు. సుమారు నాలుగు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని చదును చేసినట్లు తెలుస్తోంది. భూ కబ్జాను అడ్డుకున్న పలువురు రైతులపై అక్రమార్కులు దౌర్జన్యంగా తప్పుడు కేసులు కూడా బనాయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్ శ్రీరాములు నాయక్‌కు పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. తక్షణం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చినట్లు రైతులు పేర్కొన్నారు.
బోర్డు ఏర్పాటు చేయిస్తాం
ప్రభుత్వ భూమి కబ్జా విషయం వీఆర్వో శేఖర్ దృష్టికి రాగా తక్షణం ఆయన ఘటనా స్థలానికి వెళ్లి భూ ఆక్రమణను అడ్డుకున్నారు. ఆక్రమణదారుల వద్ద ఎలాంటి పత్రాలు లేవని నిర్ధారించాం. ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా ఆ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయిస్తాం. ఎవరైనా ప్రభుత్వ భూమిలోకి ప్రవేశిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
– శ్రీరాములు నాయక్, పెద్దతిప్పసముద్రం


