షార్ట్‌ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో సామగ్రి దగ్ధం

May 19 2026 12:46 AM | Updated on May 19 2026 12:46 AM

రాజంపేట రూరల్‌ : విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగసి పడటంతో 6 దుకాణాలలోని సరుకు కాలి బూడిద అయ్యింది. నిర్వాహకులకు రూ.80 లక్షల నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని మన్నూరులో మసీదు కాంప్లెక్స్‌ను 2021లో 6 రూములతో ఏర్పాటు చేశారు. అన్ని రూములకు కలిపి విద్యుత్‌ మీటర్‌లను ఒకే చోట ఏర్పరిచారు. ఇందులో 3 రూములను అద్దెకు తీసుకొన్న షేక్‌ ఖాదర్‌బాషా అల్‌ అమర్‌ ట్రేడర్స్‌ పేరుతో ఒక రూములో పెయింట్‌, ఒక రూములో ఎలక్ట్రికల్‌, ఒక రూములో శానిటరీ పైప్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా ఒక రూములో పాళెం ఇస్మాయిల్‌ గురు రాఘవేంద్ర స్పేర్‌ పార్ట్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. వేరొక రూములో షేక్‌ ఇంతియాజ్‌ ఇంతియాజ్‌ సొల్యూషన్‌ను ఏర్పరిచారు. మరొక రూములో చేజర్ల శంకరరాజు కూల్‌ డ్రింక్స్‌, ప్రొవిజన్స్‌ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అల్‌ అమర్‌ ట్రేడర్స్‌ వద్ద ఏర్పరిచిన విద్యుత్‌ మీటర్‌లో నుంచి రవ్వలు వెలువడ్డాయి. ఈ రవ్వలు పెయింట్‌ షాపులో ఉన్న కర్పంటాయిల్‌ మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు అధికం కావడంతో పక్కన ఉన్న దుకాణాలలోని సరుకు కూడా కాలిపోయింది. ఇదే సమయంలో ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షేక్‌ ఖాదర్‌బాషాకు రూ.70 లక్షలు, చేజర్ల శంకరరాజుకు రూ.5 లక్షలు, పాళెం ఇస్మాయిల్‌కు రూ.3.50 లక్షలు, షేక్‌ ఇంతియాజ్‌కు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలియజేశారు. బాధితులను ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఫోన్‌ ద్వారా పరామర్శించారు. నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ అధ్యక్షులు ఆకేపాటి అనీల్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని నిర్వాహకులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement