మదనపల్లెకు ప్రత్యేక బాదుడు | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెకు ప్రత్యేక బాదుడు

May 7 2026 8:20 AM | Updated on May 7 2026 8:20 AM

విలువలో వ్యత్యాసం

ఆదాయం కోసం రిజిస్ట్రేషన్ల శాఖ మదనపల్లె ప్రజలపై బాదుడుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకే పాలసీ కొనసాగుతుండగా మదనపల్లెలో ‘ప్రత్యేక మార్కెట్‌ విలువ’ పెంపు కోసం అధికారులు నివేదిక సిద్ధం చేసే పనిలో పడ్డారు. దీనికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే పట్టణ ప్రజల జేబులకు చిల్లు పడ్డట్టే. ఈ ప్రయత్నాలపై ప్రత్యేక కథనం.

ప్రాంతాల విలువను బట్టి

మార్కెట్‌ విలువ పెంపు

భారీగా ఆదాయం పెంచుకునేందుకు సిద్ధమైన చర్యలు

పట్టణంలో కలిసిపోయిన

పంచాయతీలకు ప్రత్యేకం

సాక్షి, మదనపల్లె: మదనపల్లె జిల్లా కేంద్రం కావడంతో ఇక్కడినుంచి అత్యధిక ఆదాయం రాబట్టడం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మదనపల్లె కోసం ప్రత్యేక మార్కెట్‌ విలువ పెంపునకు ప్రయత్నాలు మొదలయ్యాయి. రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండగా కూటమి ప్రభుత్వం మదనపల్లెకు మార్చింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాలను పొరుగు జిల్లాల్లో కలిపింది. చిత్తూరులోని పుంగనూరును అన్నమయ్యలో కలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయానికి గండిపడింది. ఇదే పరిస్థితి ఈ ఆర్థిక సంవత్సరంలో పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికంగా ఆదాయం పెంచుకునే మార్గాలను రిజిస్ట్రేషన్ల శాఖ అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా మదనపల్లె సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీలో ఆస్తుల విలువను పెంచడం.. అలాగే ఉంచడంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

పడిపోయిన ఆదాయం

రిజిస్ట్రేషన్లశాఖలో గత ఆర్థిక సంవత్సరం ఊహించని విధంగా ఆదాయం పడిపోయింది. 2025–26లో రూ.220.76 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా రూ.190.69 కోట్లు లభించింది. ఇందులో కలికిరి, మదనపల్లె, రాయచోటి, పీలేరు, వాయల్పాడు, పుల్లంపేట, సుండుపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు లక్ష్యాలను సాధించకపోగా ఆదాయం తగ్గింది. తంబళ్లపల్లె మాత్రమే లక్ష్యానికి మించిన ఆదాయం సాధించింది. మదనపల్లె రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి రూ.69.16 కోట్ల ఆదాయ లక్ష్యం ఉండగా రూ.63.03 కోట్ల ఆదాయమే వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జిల్లాలో రూ.22.24 కోట్ల ఆదాయం సాధించాలన్న లక్ష్యం అయితే రూ.13.26 కోట్లు మాత్రమే వసూలైంది. ఈ రకంగా ఆదాయం తగ్గిపోవడం జిల్లా అధికారుల్లో సమీక్షకు దారి తీసింది.అదాయ మార్గాలను అన్వేషిస్తోంది.

రెండే మార్కెట్‌ విలువలు

మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో రెండు రకాలైన మార్కెట్‌ విలువలను అమలు చేస్తున్నారు. వాణిజ్యపరమైన వాటికి చదరపు అడుగు రూ.32,700, గృహాలకు చదరపు అడుగు రూ.11 వేల మార్కెట్‌ విలువను రిజిస్ట్రేషన్ల సందర్భంగా వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విలువను ప్రాంతాల వారీగా వాటి విలువ ఆధారంగా చదరపు గజానికి రూ.3 నుంచి రూ.5 వేలదాకా పెంచుకునేలా వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఏ ప్రాంతంలోని ఆస్తులకు విలువ పెంచాలి లేదా అలాగే ఉంచాలి, లేకపోతే తగ్గించాలి అన్నదానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. దీని ద్వారా ఆదాయం పెంచుకోవాలని అధికారుల ఆలోచన. దీనికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపి మదనపల్లెకు ప్రత్యేక మార్కెట్‌ విలువను పెంచడానికి అనుమతి ఇవ్వాలని కోరనున్నారు.

విలీనమైన పంచాయతీలపైనా

మదనపల్లె మున్సిపాలిటీ శివారులోని కొత్తపల్లె, కొత్తిండ్లు, ఈశ్వరమ్మకాలనీ, కురవంక, వైఎస్సార్‌కాలనీ, బసినికొండ, రామాచార్లపల్లె, కొండామర్రిపల్లె, తట్టివారిపల్లె, కోళ్లబైలు, అంకిశెట్టిపల్లె, పొన్నుటిపాళెం పంచాయతీలు ఇప్పటికే పట్టణంలోకి విలీనం అయిపోయాయి. వీటి విలువను పరిశీలిస్తే పట్టణంలో ఉన్న ధర కంటే శివారు ప్రాంతంలోని కాలనీలు, లేఔట్లలో అత్యధిక ధరలు పలుకుతున్నాయి. ఇవి పూర్తిగా మున్సిపాలిటీలో కలిసిపోయాయి. ఏది మున్సిపాలిటీ పరిధి, ఏది పంచాయతీ అని తెలియనంతగా కలిసిపోయాయి. పంచాయతీల్లో చదరపు గజం మార్కెట్‌ విలువ రూ.3,900 ఉంది. ఇప్పుడు పంచాయతీలో పట్టణంలో కలిసిపోవడంతో అసాధారణమైన విలువ కలిగిన ఆస్తులపై మార్కెట్‌ విలువ పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించారు. వీటికి ఉన్న చదరపు గజం విలువను పెంచాల్సిన అవసరం ఉందని నిర్ధారించి నివేదిస్తున్నారు. మున్సిపాలిటీ ప్రాంతాలపై పెంచే మార్కెట్‌ విలువ ద్వారా వచ్చే ఆదాయం కంటే, శివారు ప్రాంతాల ఆస్తులపై పెంచే విలువ ద్వారా అత్యధిక ఆదాయం పొందే అవకాశం ఉంది.

జిల్లా కేంద్రం కావడం, ఇక్కడ ప్రభుత్వ మార్కెట్‌ విలువకు, బహిరంగ మార్కెట్‌ విలువకు పూడ్చలేనంత అంతరం ఉంది. మొత్తం మున్సిపాలిటీ పరిధికి రెండు రకాలైన మార్కెట్‌ విలువలను మాత్రమే అమలు చేస్తున్నారు. అయితే బహిరంగ మార్కెట్‌ ఆస్తుల విలువ ఊహించని స్థాయిలో పలుకుతున్నాయి. ఈ ధర ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. సాధారణ ధర కలిగిన పట్టణంలోని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవడం కోసం మళ్లీ కొత్తగా మదనపల్లె మున్సిపాలిటీకి మాత్రమే ప్రత్యేక మార్కెట్‌ విలువను పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదించేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. పుంగనూరు రోడ్డు నుంచి గాంధీ రోడ్డు, చిత్తూర్‌ బస్టాండ్‌, పటేల్‌ రోడ్డు, కదిరి రోడ్డు, రింగ్‌ రోడ్డు వరకు, అనిబిసెంట్‌ సర్కిల్‌ నుంచి బెంగళూరు రోడ్డు, నిమ్మనపల్లి సర్కిల్‌ నుంచి బైపాస్‌ రోడ్డు, ఆర్‌ఆర్‌ స్ట్రీట్‌, చెంబకూరు రోడ్డు, మల్లికార్జున సర్కిల్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి సిటిఎం రోడ్డు, టౌన్‌ బ్యాంకు సర్కిల్‌, ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి తిరుపతి రోడ్డు, తిరుపతి రోడ్డు నుంచి పారిశ్రామిక వాడ, తిరుపతి రోడ్‌ నుంచి గొల్లపల్లి బైపాస్‌ రోడ్డు మీదుగా రింగ్‌ రోడ్డు వరకు, రెడ్డప్ప నాయుడు కాలనీ, ఎస్బిఐ కాలనీ, సొసైటీ కాలనీ, రెడ్డిస్‌ కాలనీ, టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వెనకవైపు, తట్టివారిపల్లె రింగ్‌రోడ్డు నుంచి కదిరిరోడ్డు రింగ్‌రోడ్డు వరకు..ఇలా ముఖ్యమైన ప్రాంతాల్లో ఆస్తులు విలువ ఆకాశాన్నంటాయి. వాణిజ్య పరమైనవి కాని ప్రాంతాల్లో ధరల్లో వ్యత్యాసం ఉంది. రెసిడెన్షియల్‌ ప్రాంతాల్లోనూ ఒక్కోచోట ఒక్కో రకమైన విలువ ఉంది.

సబ్‌రిజిస్ట్రార్‌ లక్ష్యం వసూలు

కలికిరి 717.13 481.89

మదనపల్లె 6916.19 6303.02

పీలేరు 2027.56 1650.91

తంబళ్లపల్లె 510.22 556.20

వాయల్పాడు 794.69 681.82

బి.కొత్తకోట 739.09 655.08

చిట్వేలి 555.57 538.77

లక్కిరెడ్డిపల్లె 660.16 612.11

పుల్లంపేట 1590.19 1311.28

రాయచోటి 4871.16 3777.09

రాజంపేట 2106.01 2041.76

టి.సుండుపల్లె 588.63 459.89

Advertisement
 
Advertisement
Advertisement