● దంపతులతోపాటు వారి కుమారుడికి తీవ్ర గాయాలు
● గాయపడిన బాలుడి పరిస్థితి విషమం
మదనపల్లె టౌన్ : చౌడేపల్లి మండలంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి బాధితుల కుటుంబీకుల కథనం.. చౌడేపల్లి మండలం, చారాల పంచాయతీ, మొటుకుపల్లి కు చెందిన దంపతులు ద్విచక్ర వాహనంలో సొంత పని మీద చౌడేపల్లి కు బయలు దేరారు. స్కూటర్ మార్గ మధ్యంలోని చెరువు ముందర వడ్డిపల్లె వద్ద కు రాగానే ఎదురుగా వస్తున్న ఓ బస్ ను తప్పించబోయి బైకు అదుపు తప్పడంతో ముగ్గురు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో భార్య, భర్తలు మునిరాజా(30), మంగ (26) లతో వారి కుమారుడు సంతోష్ 8 కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి బాధితులను చికిత్స కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి దంపతులతోపాటు సంతోష్ పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
ట్రాక్టర్ ను ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొని ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదానికి సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లెకి చెందిన రైతు ఎస్.వెంకటరమణ (50) వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను పిలవడానికి పొరుగు గ్రామమైన దండువారి పల్లెకు బైకుపై బయలుదేరాడు. స్కూటర్ మార్గ మధ్యంలోని దండువారిపల్లె సమీపానికి వెళ్ళగానే రోడ్డు పక్కన లైట్లు ఆర్పి నిలబెట్టి ఉన్న ట్రాక్టర్‌ను గుర్తించలేక ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతును స్థానికులు గమనించి చికిత్స కోసం మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలించారు.
కారు ఢీకొని తమిళనాడు వాసికి..
మదనపల్లె టౌన్ : కారు ఢీకొని తమిళనాడు వాసి తీవ్రంగా గాయపడ్డ సంఘటన మంగళవారం అర్ధరాత్రి పుంగనూరు మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం తిరుచి గ్రామానికి చెందిన నెహ్రు రాజా(48), వరి కోత యంత్రాన్ని తీసుకుని పుంగనూరు మండలం ఈడిగపల్లి కు వచ్చాడని తెలిపారు. గ్రామానికి సమీపంలోని ఓ రైతు పొలంలో మరో డ్రైవర్ పంట వడుపు తుండగా, వాహనానికి డీజిల్ అవసరమై క్యాన్ తీసుకొని ఈడికి పల్లె వద్దకు వచ్చాడు. పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటే క్రమంలో ఓ కారు వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కాళ్లు చేతులు విరిగి అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం అతడి పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సలహా పై వేలూరుకి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పుంగనూరు పోలీసులు తెలిపారు.


