● పోలీసుల అదుపులోహత్య కేసు నిందితులు.. | - | Sakshi
Sakshi News home page

● పోలీసుల అదుపులోహత్య కేసు నిందితులు..

Apr 8 2026 7:20 AM | Updated on Apr 8 2026 7:20 AM

● పోలీసుల అదుపులోహత్య కేసు నిందితులు..

గంజాయి బ్యాచ్‌ అడ్డాలివే..

జిల్లాలో పేట్రేగిపోతున్నగంజాయి బ్యాచ్‌లు

ఆ మత్తులోనేపెద్దదస్తగిరి దారుణ హత్య

డ్రగ్స్‌కు యువత బానిస

నిద్దురపోతున్న ఖాకీలు

కడప అర్బన్‌: జిల్లాలో గంజాయి ముఠా అరాచకం హద్దులు దాటింది. కడప, ప్రొద్దుటూరులాంటి ప్రధాన నగరాల్లో యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసగా మారుతుండడం కలవరపరుస్తోంది. వీరి ‘మత్తు’సమాజానికి చేటుగా మారింది. తాజాగా కడప నగరంలో గంజాయి బ్యాచ్‌ పైశాచికత్వానికి ఒక నిండు ప్రాణం గాల్లో కలిసింది. ఇంత జరుగుతున్నా కొంతమంది ఖాకీలు తమ సొంతలాభాల్లోనే మునిగి తేలుతున్నారు. కేసు కట్టడానికో రేటు కడుతున్నారు.. ‘ఫైలు’క్లోజుకో రేటు చెబుతున్నారు.. ఫలితంగా శాంతిభద్రతను గాలికొదిలేస్తున్నారు. పోలీసులందరూ ఇలానే ఉన్నారని కాదు.. మెజార్టీ ఖాకీలు తమ అసలు డ్యూటీని మరిచి.. నిత్యం పచ్చ గూటిలోనే కాలం గడిపేస్తున్నారు.

కడప రిమ్స్‌ పీఎస్‌ పరిధిలో రిమ్స్‌లో గత ఆదివారం అర్ధరాత్రి (సోమవారం తెల్లవారుజామున) అలంఖాన్‌ పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి (53)ను వెంకటేష్‌, రాజా, రవి, జాకి, ఇంకా పలువురు కత్తులతో వెంటాడి దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. ఈ గంజాయి బ్యాచ్‌పై పోలీసుల నిఘా ఉండి ఉంటే ఈ దారుణమైన సంఘటన జరిగి ఉండేది కాదు. ఈ ఒక్క సంఘటనే కాదు ఇటీవల అనేక ఘటనలు జరిగాయి.. ఆయా కాలనీల్లో గంజాయి మత్తులో నిత్యం గొడవలు.. దాడులూ జరుగుతూనే ఉన్నాయి.

రిమ్స్‌ పీఎస్‌తో పాటు కడప నగరంలోని కొన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇటీవల గంజాయి గ్యాంగుల చేసిన వీరంగ సంఘటనలు గమనిస్తే...

రిమ్స్‌ పీఎస్‌ పరిధిలో చలమారెడ్డి పల్లికి చెందిన ఓ యువకుడికి కొంతమంది గంజాయి బ్యాచ్‌తో దోస్తీ కుదిరింది.. అంతే సదరు యువకుడికి గంజాయి అలవాటు చేయాలని ఆ బ్యాచ్‌ భావించింది. అనుకున్నదే తడవుగా ఆ యువకుడికి ‘మత్తు’మాటలేవో చెప్పి చలమారెడ్డి పల్లె ట్యాంకు ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి గంజాయిని సేవింప చేశారు. దెబ్బకు ఆ యువకుడు కోమాలోకి వెళ్లిపోయాడు. భయపడిన మిగతా యువకులు రహస్యంగా చికిత్స కోసం తిరుపతిలోని ఓ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. యువకుడి పరిస్థితిని గ్రహించిన డాక్టర్లు అతని తల్లిదండ్రులను పిలిపించారు. తామే ట్రీట్మెంట్‌ ఖర్చు భరిస్తామని సదరు యువకుడి తల్లిదండ్రులు వైద్యులతో బతిమలాడి చికిత్స చేయించారు. కొన్ని రోజులకు యువకుడు కోలుకున్నాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం, నిఘా లేకపోవడం గమనార్హం.

ఇదే రిమ్స్‌ పీఎస్‌ పరిధిలో చలమారెడ్డి పల్లె ప్రాంతానికి చెందిన మనోజ్‌ అనే యువకుడికి సంబంధించిన కారు అద్దాలను కడప రవీంద్ర నగర్‌కు చెందిన గంజాయి ముఠా ధ్వంసం చేసింది. తమ ఊర్లోకి వచ్చి దాడి చేయడంతో స్థానికులు తిర గబడి ఆ నలుగురిని పోలీసులకు అప్పగించారు.

కడపవన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రైల్వే స్టేషన్‌ సమీపంలో గత నెలలో మేరీ నగర్‌, అంగడి వీధికి చెందిన ఇద్దరు యువకులపై, గంజాయి బ్యాచ్‌ కత్తులతో దాడి చేశారు.

ఉక్కాయ పల్లె సమీపంలో పది రోజుల కిందట వైన్‌ షాప్‌ సమీపంలో ఉక్కాయ పల్లె, మాసాపేటకు చెందిన రెండు బ్యాచులు ఘర్షణ పడ్డాయి. రెండు వైపులా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా గంజాయి మత్తు ఘటనలు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి.

వైజాగ్‌ టు కడప

కడప నగరానికి వైజాగ్‌ నుంచి ఓ రైలులో ప్రతిరోజు సరాసరి 10 కేజీల మేరకు గంజాయి సరఫరా అవుతోందని విశ్వసనీయ సమాచారం. ఈ గంజాయిని భద్రంగా కడపకు తీసుకొచ్చినందుకు కమీషన్‌ రూపంలో వేలాది రూపాయలు ముట్ట చెబుతున్నట్లు సమాచారం.

కడప నగరంలో రిమ్స్‌ పీఎస్‌ పరిధిలో తిలక్‌ నగర్‌, తాలూకా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రవీంద్ర నగర్‌, వన్‌ టౌన్‌ పీఎస్‌ పరిధిలో గుర్రాల గడ్డ, చిన్న చౌక్‌ పీఎస్‌ పరిధిలో శంకరాపురం గంజాయి బ్యాచ్‌లకు అడ్డాగా మారాయి. అలాగే కడప నగరంలోని బైపాస్‌లో ఓ స్విమ్మింగ్‌ పూల్‌ వెనుక భాగాన గంజాయి బ్యాచ్‌ స్థావరంగా ఏర్పరచుకున్నారు. టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మాసాపేట, పోలీస్‌ స్టేషన్‌కు కూత వేట దూరంలో ఉన్న కేసీ కెనాల్‌ పరిసర ప్రాంతాలలో గంజాయి ముఠా సభ్యులు విచ్చలవిడిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. చలమారెడ్డి పల్లి ప్రాంతంలో పదిమంది, ఆర్కే నగర్‌ లో 10 నుంచి 15 మంది, తిలక్‌ నగర్‌ లో ఐదు నుంచి 6 మంది, కేంద్ర కారాగారం సమీపంలో 5 నుంచి 6 సభ్యుల చొప్పున గంజాయి బ్యాచ్‌ లుగా తమ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారు.

కడప రిమ్స్‌ ఆవరణలో దారుణంగా హత్యకు గురైన పెద్ద దస్తగిరి (53) కేసులో నిందితులు వెంకటేశు, రవి,రాజా, జాకీ లతో పాటు మరికొందరు వున్నారు. ఈ హత్య కేసును రిమ్స్‌ ఇన్‌ఛార్జ్‌ సీఐ ఓబులేసు, తమ సిబ్బందితో కలిసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. వీరిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement