పాతవా..కొత్తవా
మదనపల్లె: అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుపై కేంద్రప్రభుత్వ ప్రకటనతో ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. కొత్త అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఎమ్మెల్యేలుగా పోటీచేయాలన్న ఆశలు పెట్టుకున్న పార్టీల నేతలకు ఇది శుభవార్తే. ఈ పరిస్థితుల్లో కొత్త అసెంబ్లీ స్థానాలు ఏవి రావొచ్చు, ఏవి మారవచ్చు అన్న చర్చ రాజకీయ వర్గాల్లోనే కాక సాధారణ ప్రజల్లోనూ తీవ్రంగా నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్నమయ్యజిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే..
10 నుంచి మొదలై 14 వరకు
మద్రాస్ స్టేట్ పరిధిలోని ఉమ్మడి చిత్తూరుజిల్లాలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన ఈ ప్రథమ ఎన్నికలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 10, ఆ తర్వాత అసెంబ్లీ స్థానాల సంఖ్య తగ్గుతూ, నియోజకవర్గాలు మారుతూ, మళ్లీ తగ్గి, మళ్లీ పెరుగుతూ వచ్చాయి. 1995లో 14, 1962లో 16, 1967లో 15, 1972లో 15, 1978లో 15, 1983లో 14, 1985లో 15, 1989లో 15, 1994లో 15, 1999లో 15, 2009లో 14 అసెంబ్లీ స్థానాలు మనుగడ సాగించాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల విభజన, చేర్పులు మార్పుల తర్వాత ఇప్పటిదాకా తిరిగి జరగలేదు.
2009లో వాయల్పాడు,
లక్కిరెడ్డిపల్లె మాయం
యూపీఏ–1 ప్రభుత్వంలో చేపట్టిన నియోజకవర్గాల పునర్ విభజన, చేర్పులు, మార్పుల కారణంగా అప్పటి ఉమ్మడిచిత్తూరులోని వాయల్పాడు, ఉమ్మడికడపలోని లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. మిగతా నియోజకవర్గాల్లో మండలాల మార్పుతో భౌగోళిక స్వరూపం మారిపోయింది. ఈ మార్పు ఇప్పటికి కొనసాగుతోంది. మారిన అసెంబ్లీలు, మాయమైన నియోజకవర్గాలు ఇలా ఏర్పడ్డాయి.
● మదనపల్లె అసెంబ్లీ నుంచి బి.కొత్తకోట, కురబలకోట మండలాలను తొలగించగా పుంగనూరులోని రామసముద్రం కలిసింది.
● పుంగనూరు నుంచి పెద్దపంజాణి తొలగించగా పీలేరులోని సదుం, సోమల, రొంపిచర్ల, చంద్రగిరిలోని పులిచర్ల మండలాలు కలిశాయి.
● వాయల్పాడు నియోజకవర్గంలోని వాయ ల్పాడు, కలికిరి, కలకడ, గుర్రంకొండ, కేవిపల్లె మండలాలను పూర్తిగా పీలేరు నియోజకవర్గంలోకి కలిపారు. దాంతో వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగైంది.
● పీలేరులోని చిన్నగొట్టిగల్లు, యర్రావారిపాళెం మండలాలను చంద్రగిరి నియోజకవర్గంలోకి కలిపారు. లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గంలోని సీకెదిన్నె మండలం కమలాపురంలో, చక్రాయపేట మండలం పులివెందులలో, వీరబల్లి మండలం రాజంపేటలో, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె మండలాలను రాయచోటిలో కలిపారు. దీంతో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం కనుమరుగైంది.
● మదనపల్లెలోని బి.కొత్తకోట, కురబలకోట మండలాలను పూర్తిగా తంబళ్లపల్లెలో కలిపారు.
నియోజకవర్గాల పునర్ విభజన విషయంలో కనుమరుగైన వాయల్పాడు, లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గాలు మళ్లీ ఏర్పడతాయా లేదా అన్నది ఇప్పట్లో తేలదు. అయితే వాయల్పాడు నియోజకవర్గాన్ని తిరిగి ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కొత్తవి ఏర్పాటు చేయాల్సి వస్తే కొత్త నియోజకవర్గ కేంద్రాలకు డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. పాత నియోజకవర్గాలతో యధాస్థితి కొనసాగిస్తే పాత భౌగోళిక స్వరూపంలాగా, కొత్తగా విభజన చేబడితే భౌగోళిక స్వరూపాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.
అసెంబ్లీ స్థానాల పెంపుపై రాజకీయనేతల్లో ఆశలు
2004 ఎన్నిక తర్వాత కనుమరుగైనవాయల్పాడు, లక్కిరెడ్డిపల్లె స్థానాలు
కొత్తస్థానాల లెక్కల్లో ఉమ్మడిజిల్లాకుఆరు లేదా ఏడుస్థానాలు
ఇప్పటి జిల్లాకై తే మూడు స్థానాలుపెరిగే అవకాశం
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తే ఏడు లేదా ఎనిమిది కొత్త స్థానాలు ఏర్పాట అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త జిల్లాలు కలుపుకొని 28 కావడంతో వాటి సంఖ్య తగ్గుతుంది. రాష్ట్రవ్యాప్తంగా పెరిగే 88 స్థానాల్లో కొత్త జిల్లా ప్రాతిపదికన అన్నమయ్య జిల్లాకు కొత్తగా మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 14.22 లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక నియోజకవర్గానికి 1.60 లక్షల ఓట్లకు ఒక నియోజకవర్గాన్ని చేస్తే ప్రస్తుతం ఉన్న ఐదు నియోజకవర్గాలకు అదనంగా రెండు లేక మూడు కొత్తవి ఏర్పాటు కావొచ్చు. 2024 ఎన్నికల మేరకు ఈ నియోజకవర్గాల పరిధిలో 11.81 లక్షల ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కన రెండు ఖచ్చితంగా, మూడవ స్థానానికి అవకాశం ఉంటుంది. కాగా ఇప్పుడున్న ఐదు నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు రాయచోటిలో 2.55 లక్షల మంది ఉన్నారు. తర్వాత పుంగ నూరులో 2.42 లక్షలు. మదనపల్లిలో 2.36 లక్షలు, పీలేరులో 2.34 లక్షలు. తంబళ్లపల్లెలో 2.14 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్ పట్టణాల్లో మదనపల్లిలో అధిక మంది ఓటర్లు ఉన్నారు. పీలేరు, బి.కొత్తకోట పట్టణాల్లోనూ జనాభా పెరిగింది. జరగబోయే జనగణనలో జనాభా లెక్క, ఓటర్ల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ఈ పెరిగే ఓటర్ల సంఖ్య ఆధారంగా కూడా స్థానాల సంఖ్య పెరగడంపైనా స్పష్టత వస్తుంది.


