మదనపల్లెటౌన్ : వాల్మీకిపురం 108 సిబ్బంది నిర్వాకంతో ఎలుకల మందు తాగిన ఓ మహిళా రోగికి ప్రాణ సంకటంగా మారింది. ఇందుకు సంబంధించి బాధితురాలి భర్త తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లె పంచాయతీ, నక్కలదిన్నె సమీపంలోని పప్పిరెడ్డి పల్లెలో నివాసం ఉంటున్న వాటర్ క్యాన్లు ఇంటింటికి తోలుకునే శ్రీరాములు భార్య లక్ష్మీదేవి(30), కుటుంబ సమస్యలతో బుధవారం ఎలుకల మందుతాగింది.బాధితురాలని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. లక్ష్మీదేవి భర్త శ్రీరాములు వెంటనే 108కు ఫోన్ చేశాడు. వాల్మీకిపురం నుంచి వచ్చిన 108 వాహన సిబ్బంది లక్ష్మీదేవిని పరీక్షించి ఆమెకు బీపీ, షుగర్, సాచిరేషన్ బాగానే ఉందని విజయవాడలో ఉన్న ఈఆర్‌టీపీ డాక్టర్‌కు సమాచారం అందించారు. ఆ డాక్టర్ లక్ష్మీదేవిని తిరుపతికి తరలించడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో 108 సిబ్బంది రోగిని జిల్లా ఆస్పత్రిలోనే వదిలేసి తిరిగి వాల్మీకిపురానికి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహానికి లోనైన శ్రీరాములు తన భార్యకు ఆరోగ్యం బాగాలేకపోయినా 108 సిబ్బంది తిరుపతికి తీసుకుపోలేదని మండిపడ్డాడు. ఎలుకల మందుతాగిన తన భార్యకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు 108 సిబ్బందితో పాటు విజయవాడకు చెందిన ఈఆర్‌టీపీ డాక్టరే బాధ్యులని తెలిపారు. ఈ విషయమై వాల్మీకిపురం 108 సిబ్బంది మాట్లాడుతూ.. తమకు విజయవాడ ఈఆర్‌టీపీ డాక్టర్ అనుమతి ఇస్తేనే రోగిని మరో ఆస్పత్రికి తరలించే రైట్స్ ఉన్నాయన్నారు. ఆయన అనుమతి ఇవ్వకపోవడంతో తాము మదనపల్లె లోనే రోగిని వదిలేసి వెళ్లాల్సి వచ్చిందని వాల్మీకిపురం 108 సిబ్బంది వివరణ ఇచ్చారు.
చావు బతుకుల మధ్య రోగి


