అన్నమయ్య జిల్లా: మదనపల్లె పట్టణంలోని మణప్పురం రితి జువెలర్స్‌లో రూ.కోట్లలో మోసాలు జరగిన విషయం సోమవారం సాక్షి దినపత్రిక ద్వారా వెలుగు చూడటం పాఠకులకు తెలిసిందే. తరుగు, కూలి లేకుండా తక్కువ ధరకే బంగారు నగలు ఇస్తామని నమ్మబలికి, అమాయక ప్రజల దగ్గర రూ.కోట్లలో చీటీలు కట్టించుకున్న ఆ సంస్థ మేనేజర్ సూరజ్ పరారీలో ఉంటడంతో.. తాము కూడా మోసపోయామంటూ బాధితులు బయటికి వస్తున్నారు.
రెండవ రోజు మంగళవారం కూడా పలువురు స్థానిక ఎన్‌టీఆర్ సర్కిల్ దగ్గర ఉన్న మణప్పురం రితి జువెలరీ షాపు వద్దకు క్యూ కట్టారు. మేనేజర్ ఖాతాదారుల సొమ్ముతో ఉడాయించడంతో కంపెనీ నిర్వాహకులపైనా బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము అడ్వాన్స్ బుకింగ్ పేరుతో బంగారు నగలు కొనుగోలు చేసేందుకు పెట్టుబడులు పెట్టామని పట్టణానికి చెందిన షేక్ గౌష్, అలీ, బీఎస్ బాబుసాహేబ్ తదితరులు తెలిపారు. నిరీ్ణత గడువు తరువాత తాము పెట్టిన సమయానికి ఉన్న బంగారు ధరతో ఏ ఆభరణమైనా కొనుక్కోవచ్చునని సంస్థ నమ్మబలికిందని చెప్పారు.
కొనుగోలు సమయంలో తరుగు, కూలి లేకుండా ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతోనే తాము లక్షలు పెట్టుబడి పెట్టినట్లు ఆరోపించారు. మేనేజర్ సూరజ్ తాము కట్టిన నగదును తన ఖాతాకు బదిలీ చేసుకుని 20 రోజుల క్రితం పరారైనట్లు సిబ్బంది పేర్కొనడం, దానికి తోడు తమ పేర్లు కంపెనీ వద్ద లేవని చెప్పడం చూస్తుంటే దీని వెనుక కంపెనీలోనే ఇంటి దొంగల బాగోతం ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు స్పందించి మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.


