మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఆదినుంచి రైతు వ్యతిరేకంగానే మిగిలిపోయారన్నారు. వ్యవసాయం దండగ, ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవచ్చని వ్యంగ్యంగా విమర్శించిన చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తోడేసుకుంటోందని దాంతో రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని గుర్తించిన వైఎస్.జగన్ .. ఇక్కడి రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు, దుర్భిక్ష పరిస్థితులను దూరం చేసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దీనివల్ల జగన్‌కు కీర్తి ప్రతిష్టలు వస్తాయన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకం పనులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరగానే నిలిపివేశారని దుయ్యబట్టారు. సీమ ఎత్తిపోతల పనుల పూర్తి కోసం పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి గ్రామస్థాయిలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
మదనపల్లె: రాయలసీమ ఎత్తిపోతల పథకం అసంపూర్తి పనులను పూర్తి చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ నినదించింది. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి మదనపల్లె నుంచి సమరశంఖం పూరించింది. మదనపల్లెలో మంగళవారం ఆ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతమైంది. రాయల సీమ రైతులకు వరమైన ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ సీఎం కోసం పణంగా పెట్టారని, తక్షణమే అసంపూర్తి పనులను పూర్తిచేసి కృష్ణా జలాలు రైతాంగానికి అందించాలని వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం రైతాంగ ప్రయోజనాలను బలి చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ముందు దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
లిఫ్ట్ లేకుంటే కష్టాలే..
మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయలసీమ లిఫ్ట్ సాధన కో–ఆర్డినేటర్ సాకే శైలజానాథ్ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ గురించి సమగ్రంగా వివరించారు. ఈ పథకం చంద్రబాబు నిలిపివేయడం వల్ల సీమ రైతాంగానికి కలుగుతున్న నష్టం, దెబ్బతింటున్న సాగు ప్రయోజనాల గురించి విపులంగా అవగాహన కల్పించారు. సీమ లిఫ్ట్ ద్వారా గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ, గండికోట రిజర్వాయర్ లకు అందాల్సిన సాగునీరు అందకుండా పోతే ఈ ప్రాంత రైతుల పరిస్థితి ఎలా ఉండబోతుందో, వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయో కూలంకశంగా వివరించారు. సీమ ప్రయోజనాలను కాపాడేలా మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలు, రైతాంగానికి కలిగిన ప్రయోజనాల గురించి రౌండ్ టేబుల్ సమావేశ వేదికపై వివరించారు. సాగు, తాగునీటి కోసం ఆ ఇద్దరు నేతలు చేసిన కృషి, ఎగువ రాష్ట్రం తెలంగాణ కుతంత్రాలను అడ్డుకున్న తీరు, మన రైతుల ప్రజా ప్రయోజనాలను కాపాడిన విధానాన్ని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పథకాన్ని నిలిపివేసి రైతులకు చేస్తున్న ద్రోహం, దీన్ని అధిగమించే ప్రాజెక్టు పనులు పూర్తి చేయించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణ పై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
● మాజీ ఎమెల్సీ బి.నరేష్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఈసీ మెంబర్ జి.షమీంఅస్లాం, సీనియర్ నేత తిమ్మారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మనూజ, పార్టీ పరిశీలకులు ఉదయ్ , జింకా వెంకటా చలపతి, వీఎస్ రెడ్డి, రేవతి,వైఎస్సార్ సీపీ ఐటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ మంజునాథ్ పాల్గొన్నారు.
మరో ఉద్యమం
రాయలసీమ పథకాన్ని పూర్తి చేయించడం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఉద్యమం క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. కేంద్ర కమిటీ ఆదేశాలు పాటిస్తూ రైతు ప్రజలను చంద్రబాబు ఏ విధంగా తెలంగాణకు తాకట్టు పెట్టారో వివరించాలి. క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో పార్టీ శ్రేణులు క్రియాశీలకంగా వ్యవహరించాలి. భావితరాల భవిష్యత్తుకు బాటలు వేసే ఎత్తిపోతల పథకం పూర్తి చేయించడం కోసం నడుం బిగించాలి.
–నిసార్ అహ్మద్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మదనపల్లె
సాహసోపేత నిర్ణయం
రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ చేపట్టడం సాహసోపేతమైన నిర్ణయం. జగనన్న చేతల్లో రైతు సంక్షేమాన్ని చూపిస్తే, చంద్ర బాబు సీమ ప్రజలపై ప్రేమ లేకున్నా నటిస్తున్నారు. రైతాంగ కష్టాలు తెలిసినా ద్రోహానికి పాల్పడుతున్నారు. అమరావతిలో వేలకోట్ల అభివృద్ధి పేరుతో దోపిడీ చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్‌కు రూ.3 వేల కోట్లు ఇవ్వలేకపోవడం దారుణం. మదనపల్లె, తంబళ్లపల్లె, ప్రాంతాలకు కృష్ణా జలాలు తప్ప మరో మార్గం లేదు. ఈ ప్రాంత రైతులకు ఎప్పుడూకష్టాలే, పనులు లేక వలసలు పోతున్నారు. బాబు చేస్తున్న ద్రోహాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. –ఆర్.రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
చంద్రబాబు మెడలు వంచైనా పనులు చేయిద్దాం
రాజధాని పేరుతో రూ.వేల కోట్ల దోపిడీ
లిఫ్ట్ పనులకు రూ.3వేల కోట్లు లేవా
మొదటినుంచి చంద్రబాబురైతు వ్యతిరేకి
మదనపల్లె రౌండ్ టేబుల్ సమావేశంలోమాజీ మంత్రులు పెద్దిరెడ్డి, శైలజానాఽథ్, వైఎస్సార్‌సీపీ నేతలు


