కడప కోటిరెడ్డిసర్కిల్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి క్షేత్రంలో బుధవారం జరిగే స్వామి వారి కల్యాణోత్సవాన్ని అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ డిపోల నుంచి బస్సులు నడుస్తాయని ఆయన వివరించారు. కడప డిపో నుంచి 35, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, ప్రొద్దుటూరు 7, రాజంపేట, రాయచోటి డిపోల నుంచి 17 బస్సులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 40 బస్సులు కలిపి మొత్తం 145 బస్సులు స్వామి వారి కల్యాణోత్సవ సందర్బంగా నడుస్తాయని తెలిపారు. అలాగే కడప వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం నుంచి కళ్యాణోత్సవం జరిగే ప్రదేశం వరకు 12 ఉచిత బస్సులు, రాజంపేట వైపు సాలాబాద్ క్రాస్ పార్కింగ్ స్థలం నుంచి కళ్యాణోత్సవం ప్రదేశం వరకు 8 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా పొరుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.


