● భక్తులను కరుణించిన కోదండరాముడు
● తిలకించి పులకించిన భక్తజనం
మాడ వీధుల్లో హనుమంత వాహనంపై అభయమిస్తున్న కోదండ రాముడు
గ్రామోత్సవంలో కోలాట బృందం, భక్తులు
ఒంటిమిట్ట : కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం రాత్రి కోదండరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. త్రేతా యుగంలో రామభక్తుడిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్దిగాంచిన వాడు హనుమంతుడు. దాస భక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాముల వారు ముగ్దమనోహరంగా దర్శనమిచ్చారు.
నవనీతకృష్ణాలంకారంలో రామయ్య
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త జన బృందాలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండడగా, మంగవాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. చిన్ని కృష్ణుడిని లీలలను గుర్తు చేస్తూ రాముల వారు వెన్నకుండతో భక్తులకు దర్శన మిచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు
కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు మంగళవారం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు మోహినీ అలంకారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. రాత్రి 7 నుంచి 9:00 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు.


