● కృష్ణాలో తగ్గిన వరద నీటి రోజులు
● పోతిరెడ్డిపాడు ఒక్కటే
నీటి అవసరాలు తీర్చలేదు
● మాజీ సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ‘సీమ ఎత్తిపోతల’కు శ్రీకారం
● సీఎం చంద్రబాబు అండ్ కో
కుతంత్రాలతో ఆగిన పనులు
● నేడు మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ
ముఖ్యనేతల రౌండ్ టేబుల్ సమావేశం
సాక్షి ప్రతినిధి, కడప: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి చట్టబద్ధంగా దక్కిన వాటా జలాలను వినియోగంలోకి తెస్తూ, దుర్భిక్ష ప్రాంతాలైన ఉమ్మడి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటి భద్రతను చేకూర్చాలనే లక్ష్యంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంది. కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు తాగు, సాగునీటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయడమే లక్ష్యంగా నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరాక తెలంగాణ ఒత్తిళ్లకు తలొగ్గి ఎత్తిపోతల పనులు నిలిపివేయంతో ఇక్కడి ప్రజానీకంలో తీవ్ర ఆందోళన, అభద్రత నెలకొంది.
శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల స్థాయి నీటి మట్టం నుంచే రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పనులను రూ.3,825 కోట్లుకు మంజూరు చేశారు. టెండర్లు పూర్తి చేసుకొని ఎత్తిపోతల పనులు ఎన్నికలకు ముందు శరవేగంగా సాగాయి. ఎన్నికలు పూర్తి అయ్యాక రాయలసీమ ఎత్తిపోతల పథకం మరుగున పడింది. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని నిలిపివేయించినట్లు ప్రకటించారు. దాంతో ఒక్కమారుగా రాయలసీమకు చోటుచేసుకున్న అన్యాయం బహిర్గతమైంది.
శాశ్వత ప్రయోజనం కోసమే...
రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే రాయలసీమ, నెల్లూరు జిల్లాలు పూర్తి స్థాయిలో సుభిక్షం అవుతాయి. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా రెండో దశలో ఉమ్మడి వైఎస్సార్ కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు నీళ్లందించేలా పనులు చేపట్టారు. గాలేరు–నగరి సుజల స్రవంతి– హంద్రీ–నీవా సుజల స్రవంతిని అనుసంధానిస్తూ పనులను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా తరలించిన నీటిని గాలేరు నగరి సుజల స్రవంతి ద్వారా హంద్రీ–నీవా రెండో దశకు తరలించి, ఆ నీటిని నిల్వ చేసేందుకు ముదివేడు, నేతిగుంటపల్లి, అవులపల్లి వద్ద మూడు రిజర్వాయర్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌సీపీ సర్కారే ఆ మూడు ప్రాజెక్టుల కోసం రూ.669కోట్లు వెచ్చించింది. ఆ రిజర్వాయర్లు ద్వారా 1.10లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే పనులను వైఎస్ జగన్ సర్కార్ పరుగులెత్తించారు. ఈ పసులకు కూడా చంద్రబాబు సైంధువుడిలా అడ్డుపడ్డారని రాయలసీమ వాసులు వాపోతున్నారు. రాయలసీమకు శాశ్విత ప్రయోజనం కల్పించే ఈ ప్రాజెక్టును అర్థాంతరంగా నిలబెట్టిన ఘనత చంద్రబాబు సర్కార్‌దేనని విశ్లేషకులు వాపోతున్నారు.
ప్రత్యక్ష ఆందోళనకు వైఎస్సార్‌సీపీ శ్రీకారం
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం వైఎస్సార్‌సీపీ ప్రత్యక్ష ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అన్నీ జిల్లాల పరిధిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవశ్యకతను వివరిస్తూ గళమెత్తారు. ఉద్యమాన్ని కొనసాగించే క్రమంలో కార్యాచరణ కోసం గ్రేటర్ రాయలసీమ పరిధిలో అన్నీ జిల్లాలకు చెందిన నాయకులు కడప కేంద్రంగా ఏకమయ్యారు. కార్యచరణ దిశగా మంగళవారం మదనపల్లె కేంద్రంగా ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సాకే శైలజానాథ్, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, రమేష్‌కుమార్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబు, మదనపల్లె ఇన్‌ంఛార్జి నిస్సార్‌అహమ్మద్ తదితరులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో క్షేత్రస్థాయి కార్యచరరణ నిమిత్తం ప్రణాళికలు చేపట్టనున్నారు.


