గడ్డివామి దగ్ధం
ములకలచెరువు : అగ్ని ప్రమాదంలో గడ్డివామి దగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు... మండలంలోని మద్దినాయునిపల్లి పంచాయతీ ఎండపల్లెలో డి.ఆదెప్పకు చెందిన గడ్డివామికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు గమనించి బాధితుడికి సమాచారం అందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలకు వరిగడ్డి వామి సగం వరకు కాలి బూడిదయ్యింది. ప్రమాదంలో సుమారుగా 14 ట్రాక్టర్ లోడుల వరిగడ్డి కాలిపోయిందని బాధితుడు వాపోయాడు.
టమాటా లారీ బోల్తా
పుంగనూరు : పుంగనూరు సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై టమాటా లారీ బోల్తా పడిన సంఘటన ఆదివారం జరిగింది. టమాటాల లోడ్డుతో మొలకలచెరువు నుంచి చైన్నెకి వెళ్తున్న లారీ పుంగనూరు సమీపంలోని లక్కుంట వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో టమాటాలు జాతీయ రహదారిపై పడి సుమారు రూ.2 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేడి నీళ్లు పడి చిన్నారికి గాయాలు
మదనపల్లె రూరల్ : బకెట్‌లోని వేడినీళ్లు మీద పడి చిన్నారి గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె పంచాయతీ నవోదయ కాలనీకి చెందిన షబీవుల్లా, మహబూబ్‌జాన్ దంపతుల కుమారుడు మహమ్మద్ జియాన్(4)ను ప్రతి రోజు స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చటి వేడినీటి పాత్రలో కొంతసేపు కూర్చోబెట్టడం అలవాటు చేశారు. ఈ క్రమంలో మహబూబ్‌జాన్ ఆదివారం ఉదయం మామూలు స్నానానికి నీళ్లు వేడి చేసి బకెట్‌లో పోసి పెట్టి, మరో గదిలో పని చేసుకుంటుండగా, పక్కనే ఆడుకుంటున్న జియాన్ అలవాటు ప్రకారం తనకు పెట్టిన వేడినీళ్లు అనుకుని పొరపాటుగా వేడినీళ్ల బకెట్‌లో కూర్చున్నాడు. దీంతో బాలుడి వెనుకభాగం పాక్షికంగా కాలి చర్మం ఊడిపోయింది. దీంతో బాలుడు కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అధికభాగం చర్మం కాలిపోవడంతో ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
రోల్‌ఆఫ్‌పీఎస్ హెచ్‌ఎం
ఉత్తర్వులు రద్దు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : పీఎస్ హెచ్‌ఎంల అధికారాలకు అనువుగా లేని రోల్ ఆఫ్ పీఎస్ హెచ్‌ఎం ఉత్తర్వులను రద్దు చేయాలని ఏపీ పీఎస్ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. కడపలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏపీ పీఎస్ హెచ్‌ఎం ఫోరం రాయలసీమ జిల్లాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్ హెచ్‌ఎం ఫోరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సూర్యనారాయణ (సత్య సాయి జిల్లా), రంగారెడ్డి (అనంతపురం జిల్లా), రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసులు (తిరుపతి జిల్లా), చిట్టిబాబు (చిత్తూరు జిల్లా), కడప జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, శ్యాంసుందర్, తిరుపతి, సత్య సాయి జిల్లాల ఫోరం అధ్యక్షులు వెంకట రమణయ్య, షరీఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, నాగూర్, కడప జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆదిల్ బాషా, సురేందర్‌రెడ్డి, వెంకట రమేష్ పాల్గొన్నారు.
గడ్డివామి దగ్ధం


