బద్వేలు టీడీపీలో విభేదాలు బట్టబయలు
● ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా వర్గపోరు బహిర్గతం
● వేర్వేరుగా కార్యక్రమాల నిర్వహణ
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మొన్న సంక్రాంతి సంబరాల పేరుతో అట్లూరు మండలంలో వేరువేరుగా పోటాపోటీగా క్రికెట్ పోటీలు నిర్వహించిన బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రితీష్‌రెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డిలు.. ఆ ఘటన మరువక ముందే ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు రెండు వర్గాలుగా విడిపోయి నిర్వహించడంతో ఆ అంశం చర్చనీయాంశంగా మారింది.
కొనసాగుతున్న ఆధిపత్యపోరు
బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు మున్సిపాలిటీలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఓ వర్గం రితీష్‌రెడ్డి చెంత, మరో వర్గం సూర్యనారాయణరెడ్డి చెంత చేరాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బద్వేలు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంపికపై చేపట్టిన ఐవీఆర్‌ఎస్ కాల్ వ్యవహారంతో అప్పటి వరకు చాపకింద నీరులా కొనసాగుతున్న ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఈ క్రమంలో సూర్యనారాయణరెడ్డికి పార్టీ అధిష్టానం డీసీసీ బ్యాంకు చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీంతో రితీష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నియోజకవర్గంలోని పలువురు ద్వితీయశ్రేణి టీడీపీ నేతలు సూర్యనారాయణరెడ్డి చెంతకు చేరారు. సూర్యనారాయణరెడ్డి సైతం అంతర్గతంగా రితీష్‌రెడ్డి వ్యతిరేక వర్గంతో మద్దతు కూడగట్టుకుంటున్నట్లు సమాచారం.
పోటాపోటీగా కార్యక్రమాలు
ఇటీవల సంక్రాంతి సందర్భంగా అట్లూరు మండలంలో పోటాపోటీగా వేరువేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించిన రితీష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డిలు తాజాగా ఎన్టీఆర్ వర్ధంతిని సైతం వేరువేరుగా నిర్వహించారు. తొలుత డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి తన అనుచరవర్గంతో నెల్లూరు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా అనంతరం రితీష్‌రెడ్డి, విజయమ్మలు తమ అనుచరులతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు ఎంత దూరం వెళతాయో అనే చర్చ నడుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ లింగప్ప, ఎస్‌ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
బద్వేలు టీడీపీలో విభేదాలు బట్టబయలు


