బస్సులో సీట్లు ఖాళీ లేవు ప్లీజ్..!
గుర్రంకొండ : ‘బస్సులో సీట్లు ఖాళీగా లేవు ప్లీజ్ వేరే బస్సులు ఎక్కండి.’ ఇదీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సిబ్బంది ఇస్తున్న సలహాలు. దీంతో ఉచిత ప్రయాణమైనా తగినన్ని బస్సు సర్వీసులు లేక పోవడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెల నుంచి జనం పట్టణాలవైపు బాట పట్టారు. దీంతో ఆదివారం గుర్రంకొండ బస్టాండు ప్రయాణికులతో కిటకిటలాడింది. నాలుగు మండలాలకు మధ్యలో గుర్రంకొండ పట్టణం ఉండడంతో వందలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ ముంగించుకొని తిరుగు ప్రయాణాలు చేపట్టడంతో పెద్ద ఎత్తున మహిళలు, ప్రయాణికులు బస్టాండుకు చేరుకొన్నారు. వివిధ మార్గాల్లో ప్రయాణించడానికి గానూ ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడసాగారు. అయితే ఏ బస్సు వచ్చినా సీట్లు లేవు అంటూ ఎక్కించుకోలేదు. దీంతో మహిళలు ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి బస్టాండులో బస్సుల కోసం వేచి చూస్తున్నా ఒక్క బస్సులో కూడా ఎక్కించుకోకపోవడంతొ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై బస్సుల కోసం వేచి చూసి విసిగి వేశారి పోయారు. తాము అత్యవసర పనిమీద వెళుతున్నాము సీట్లు లేకపోయినా నిలబడి వెళాతము అని బతిమిలాడుకొన్నా ఆర్టీసీ సిబ్బంది ససేమిరా అంగీకరించక పోవడం విమర్శలకు దారితీస్తోంది. దీంతో ఉచిత ప్రయాణం అని బోర్డులు పెట్టనేల, మాకు ఈ కష్టాలు రానేల అంటూ మహిళలు ఉసూరుమని వెళ్లిపోయారు. కాగా కొంతమంది ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.
ఆర్టీసీ బస్సుల్లో తప్పని పాట్లు


