సాక్షి విలేకరిపై దాడికి యత్నం
రాయచోటి : అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం సాక్షి రిపోర్టర్ ముప్పాల లక్ష్మీ నరసింహరాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు.ఈ సంఘటనపై ఆదివారం లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో స్థానిక మీడియా మిత్రులతో కలిసి రిపోర్టర్ రాజు ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. శనివారం(17వ తేదీ) లక్కిరెడ్డిపల్లి లో పని ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో రాయచోటికి వెళుతుండగా మద్దిరేవుల క్రాస్ రోడ్డు వద్ద నల్లటి స్కార్పియో వాహనంలో గుర్తుతెలియని వ్యక్తులు తన వాహనాన్ని వెంబడించినట్లు గుర్తించినట్లు రాజు తెలిపారు. సమీపంలోనే ఏకిలపల్లి గ్రామ రోడ్డుకు ద్విచక్ర వాహనాన్ని మళ్లించి అతివేగంగా గ్రామంలోకి చేరుకున్నానన్నారు. వాహనం వెంబడించి కేకలు వేసుకుంటూ గ్రామం వరకు రావడంతో వారికి కనిపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశానన్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా రెండు పర్యాయాలు తనపై దాడికి ప్రయత్నాలు చేశారన్నారు. తనకు గుర్తుతెలియని వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉంది. సిసి పుటేజ్‌లు పరిశీలించి, విచారించి, వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహరాజు ఫిర్యాదు ద్వారా ఎస్‌ఐని కోరారు. సాక్షి రిపోర్టర్‌పై జరిగిన దాడియత్నాన్ని స్థానిక మీడియా మిత్రులు తీవ్రంగా ఖండించారు. దాడిచేసిన వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. నీతి నిజాయితీతో వార్తలు రాస్తున్న రిపోర్టర్లకు మద్దతుగా నిలవాలని వారు డిమాండ్ చేశారు.


