పుష్పగిరిలో అరుదైన కుడ్యశిల్పం
కడప ఎడ్యుకేషన్ : వల్లూరు మండలం పుష్పగిరిలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గోడపై యుద్ధాలలో వీరులు కవచం ధరించక పోతే ప్రమాదం తప్పదని తెలిపే కుడ్యశిల్పం సూక్ష్మతి సూక్ష్మమైనదని, అరుదైనదని రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం మీడియాతో తెలిపారు. యోధులు తమ శరీర భాగాలను రక్షించుకోవడానికి ఇనుము, ఉక్కు వంటి లోహాలతో చేసిన రక్షణ దుస్తులను ధరించే వారని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోతే ప్రమాదమని ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారని, కొన్ని వందల ఏళ్ల కిందటే ఈ విషయాన్ని శిల్పులు తమ శిల్పకళా నైపుణ్యం ద్వారా ప్రాచుర్యం కల్పించాలని చెప్పారు. ఈ కుడ్య శిల్పంలో ఎడమవైపు ఇద్దరు యుద్ధ వీరులు ఉన్నారని తెలిపారు. ఒక వీరుడు తన కుడి చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని నేల మీద ఉంచినట్లుగా, ఎడమ చేతితో మరొక వీరుడి కేశాలను పట్టుకున్నట్లుగా, తన కాళ్లను వంచినట్లుగా చిత్రీకరించారన్నారు. చెవులలో పెద్ద కుండలాలు, ఎడమ చేతిలో కేయూరం ఉందని చెప్పారు. రెండవ యుద్ధ వీరుడు తన కుడి చేతిలో ఉన్న ఖడ్గాన్ని మొదటి యుద్ధ వీరుడి పార్శ్వ ఉదరంలో పొడిచినట్లుగా శిల్పీకరించారని వివరించారు. చేతులలో కేయూరాలు, మురుగులు, యజ్ఞోపవీతం, కంటి, శేరు, చెవులకు పెద్ద కుండలాలు, తల కుడి వైపునకు కొద్దిగా ఉంచినట్లుగా, ఎడమ చేతిని పైకి ఎత్తినట్లుగా ఆనాటి శిల్పులు అద్భుతంగా చెక్కారని తెలిపారు. ఈ వీరులకు పక్కగా కుడివైపు ఒక యుద్ధ సైనికుడు ఉన్నారన్నారు. ఈ సైనికుడు సమపాద స్థానంలో నిలుచుని తన దేహాన్ని మొత్తం కవచంతో కప్పినట్లుగా ఉందని తెలిపారు. కవచంలో నిలువు, అడ్డు గీతలు వాటి మధ్యలో వలయాలను ఉంచారన్నారు. కుడి చేతిని తన ఎదవైపు ఉంచి ఒక ఖడ్గాన్ని భుజం వైపునకు పెట్టుకున్నట్లుగా ఆనాటి శిల్పులు అచ్చేరువు పొందేట్లు చిత్రీకరించారని చెప్పారు. చెవులలో పెద్ద కుండలాలు, తలపై చిన్నపాటి శిరస్త్రాణం ధరించినట్లు ఉందని వివరించారు.


