కోడిపందెం స్థావరంపై దాడి
కడప అర్బన్ : కడప నగరం చిన్న చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉక్కాయపల్లె సమీపంలోని కంపచెట్లలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కోడిపందాలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో చిన్న చౌక్ సీఐ ఓబులేసు రాజరాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. 20 మంది యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.15,500 నగదు, నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
బంగారు చైన్ అప్పగింత
కడప అర్బన్ : కడప సిటీ చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 13న బీడి కాలనీకి చెందిన శీలం నాగయ్య తన మోటార్ సైకిల్‌లో ప్రయాణిస్తూ సుమారు రూ.4.5 లక్షల విలువ గల (30.210 గ్రాములు) బంగారు చైన్ ఉన్న బ్యాగ్‌ను దారి మధ్యలో పోగొట్టుకున్నారు. ఆయన వెంటనే చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా సీఐ ఎ.ఓబులేసు, ఎస్‌ఐ ఎన్.రాజరాజేశ్వరరెడ్డి తక్షణమే స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. బ్యాగ్ ఒక వ్యక్తికి దొరికినట్లు గుర్తించి, అతని నుంచి బంగారు చైన్ ఉన్న బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని ఆదివారం బాధితుడు శీలం నాగయ్యకు తమ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఆపరేషన్‌లో చిన్నచౌక్ సీఐ, ఎస్‌ఐతోపాటు, పోలీస్ సిబ్బంది పి.ఖాదర్ హుస్సేన్, ఎస్.ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


