హంద్రీ నీవా కాలువలో పడి పెయింటర్ మృతి
కురబలకోట : ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనతో ఓ కార్మికుడి జీవితం అకాలంగా ముగిసింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు దగ్గరున్న హంద్రీనీవా పంప్ హౌస్ వద్ద శనివారం మధ్యాహ్నం సిబ్బంది ఫోర్ వే వద్ద చిక్కుకున్న చెత్త చెదారాన్ని తొలగించడానికి కిందికి దిగారు. కాలువ నీళ్లు సజావుగా పంప్ హౌస్‌లోకి వెళ్లడానికి వీలుగా.. అడ్డుగా ఉన్న చెత్తా చెదారన్ని తొలగించసాగారు. ఈ క్రమంలో ఓ చెయ్యి బయటపడింది. అతను ఉలిక్కి పడ్డాడు. ఈ సంఘటనతో స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల వారిలో తీవ్ర కలకలం రేగింది. ఆ తర్వాత శవం కొట్టుకు వచ్చినట్లుగా భావించి స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. శవాన్ని అతి కష్టం మీద పోలీసులు కాలువలో నుంచి బయటికి తీశారు. పరిసర ప్రాంతాల వారు గుర్తించి ఇతను సమీపంలోని తెట్టు గ్రామం మిట్టపల్లికి చెందిన నారాయణ (50)గా గుర్తించారు. ఆయన వృత్తి రీత్యా పెయింటర్‌గా పని చేస్తూ రోజు వారి కూలిపై జీవనం సాగించేవారు. దీంతో ఒక్కసారిగా ఎవరన్న మిస్టరీ వీడిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబీకులకు సమాచారం అందించి శవాన్ని పోస్టుమార్టంకై మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుడి స్వగ్రామం మిట్టపల్లి మీదుగా హంద్రీనీవా కాలువ వస్తుంది. శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు కాలు జారి పడడం వల్ల దగ్గరలోనే ఉన్న అంగళ్లు పంప్ హౌస్ వద్దకు కొట్టుకుపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. వాస్తవం ఏమిటన్నది పోస్టుమార్టంలో తెలిసి రాగలదని ముదివేడు ఎస్‌ఐ మధు రామచంద్రుడు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలువలో కష్టజీవి జీవితం కడతేరడం పట్ల స్థానికంగా విచారం వ్యక్తమవుతోంది.


