రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
చౌడేపల్లె : చౌడేపల్లె– తిరుపతి ప్రధాన రహదారిలోని సింగిరిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింగిరిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడని అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, తీవ్రంగా గాయపడిన అతన్ని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడు. మృతుడి జేబులో గల బస్ టికెట్టుతోపాటు ఇతర ఆధారాలతో పరికిదొనకు చెందిన శ్రీనివాసులు(52)గా గుర్తించి సమాచారమిచ్చారు. మృతుడి భార్య ఓబులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


