కిడ్నీ రాకెట్ కేసు ప్రధాన నిందితుడికి అస్వస్థత
మదనపల్లె రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు, అన్నమయ్య జిల్లా మాజీ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. మదనపల్లె సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు శనివారం ఉదయం మైల్డ్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన జైలు అధికారులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో ఈసీజీ, ఇతర పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలు అందించారు. సాయంత్రం పరిస్థితి సమీక్షించిన వైద్యులు నిందితుడు డాక్టర్ ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించి తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆయనను జైలు అధికారులు భద్రత నడుమ తిరుపతికి తరలించారు.


