వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి
కలికిరి : గర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన శనివారం ఉదయం కలికిరి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని టి.సండ్రావారిపల్లి గ్రామం దూదేకులపల్లి బస్టాప్ సమీపాన చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలో సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో టి.సండ్రావారిపల్లి వీఆర్‌ఒ శ్రీనివాసులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఏఎస్‌ఐ నరసింహులు తెలిపారు. మహిళ సమాచారం తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.


