కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ ఆవుల పల్లెకు చెందిన సుధాకర్ భార్య నవిత(23) కుటుంబ సమస్యలతో గురువారం ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాఽధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు గౌనుపల్లికి చెందిన హరీష్ భార్య జ్యోతి(26) కుటుంబ సమస్యల కారణంగా లక్ష్మణ రేఖ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలని వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
పశ్చిమ బెంగాల్ వ్యక్తి ఆత్మహత్య
రొంపిచెర్ల : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో గురువారం జరిగింది. మృతుని భార్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నర్సరీలైన్, జల్‌పైగురి గ్రామానికి చెందిన రతు చిక్ బరాక్ కుమారుడు రవీంద్ర చిక్ బరాక్ (28) తన భార్య రష్మా చిక్ బరాక్ 40 రోజుల క్రితం బతుకు దెరువు కోసం రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లెకు వచ్చారు. దండపాణి మామిడి తోట సమీపంలో కోళ్ల ఫారం షెడ్‌లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం తిని షెడ్‌లోకి వెళ్లాడు. ఎంత సేపటికి బయట రాక పోవడంతో భార్య షెడ్ రూంలో చూడగా తాడుతో ఉరి వేసుకుని వేలాడుతుండడం కనిపించింది. దీంతో చుట్టు పక్కల వారిని పిలిచి కిందకు దించారు. అనంతరం అన్నమ్మయ్య జిల్లా పీలేరులో ఉన్న కోళ్లఫారం షెడ్ ఓనర్ అన్వర్‌బాషాకు తెలియజేశారు. దీంతో ఈ విషయాన్ని రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతుడి భార్యను విచారించగా భర్త ఆనారోగ్యంతో ఉన్నాడని, మతి స్థిమితం కూడా సక్రమంగా ఉండదని చెప్పింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదు చేశారు. మృతునికి భార్యతోపాటు ఒక కుమారై కూడా ఉన్నారు.
ఆత్మహత్యకు యత్నించిన
వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : అప్పుల బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. మండలంలోని బసినికొండకు చెందిన శ్రీధర్ బాబు(35) స్థానికంగా ఓ పెట్రోల్ బంక్ లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అనూరాధ, ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ,వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద దాదాపు రూ. 10 లక్షల పైగా అప్పు చేశాడు. తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తాయి.రుణదాతల నుంచి ఇటీవల ఒత్తిడి అధికమైంది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీధర్ బాబు బుధవారం ఇంటి వద్ద గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు బాధితుడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య అనూరాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
కాటేసిన పాముతో ఆసుపత్రికి...
మదనపల్లె రూరల్ : ప్రమాదవశాత్తు ఓ పాము వ్యక్తిని కాటు వేయగా, ఆసుపత్రికి పరుగులు తీసిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. దుబ్బిగాని పల్లె పంచాయతీ యనమలవారిపల్లికి చెందిన మౌలా (40) ఇంటి పక్కన ఉన్న మరో ఇంట్లోకి పాము వచ్చింది. పక్కింటి వారు ఆందోళనకు గురై, పామును చంపేయమని మౌలాను కోరారు. పామును చంపడానికి ప్రయత్నిస్తుండగా మౌలా చేతిపై పాము కాటేసింది. వెంటనే తేరుకుని స్థానికుల సాయంతో పామును చంపి, వైద్యచికిత్సల కోసం పాము తో పాటు బాధితుడు మౌలా స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అత్యవసర విభాగ వైద్యులు చికిత్సలు అందించడంతో ప్రమాదం తప్పింది.
మూడు చోట్ల చోరీ
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరులో గురువారం రాత్రి ఒక్కరోజే మూడు చోట్ల చోరీలు జరిగాయి.మరో రెండు చోట్ల విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే కందుకూరులోని రియాజ్ చిల్లర దుకాణంలో నగదుతో పాటు మొత్తం రూ.20 వేల విలువ చేసే నిత్యావసర సరుకులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. యజమాని శుక్రవారం ఉదయం దుకాణం తెరవగా చోరీ విషయాన్ని గుర్తించారు. అయితే దుకాణానికి వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయని ఎవరో తెలిసిన వ్యక్తులే దొంగతనాలకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మసీదులో ఇటీవల కొత్తగా తెచ్చిన స్టాండ్ ఫ్యానును దోచుళ్లారు. మూడు రోడ్ల కూడలిలోని రెడ్డెప్ప అనే వ్యక్తి దుకాణంలో 30 లీటర్ల పెట్రోల్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఖాదర్‌వలి, వాసులకు చెందిన దుకాణాల్లో చోరీకి విఫలయత్నం చేశారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
అట్లూరు : మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డా రు. స్థానికుల కథనం మేరకు అట్లూరు క్రాస్ రోడ్డుకు చెందిన పట్టెం రవికుమార్‌రెడ్డి, గంగిరెడ్డి ద్విచక్రవాహనంలో బద్వేలు వైపునకు వెళుతుండగా కడప–బద్వేలు ప్రధాన రహదారిలో ఉన్న కలివికోడి పరిశోధన కేంద్రం వద్ద అకస్మాత్తుగా పశువులు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌లో వారిని కడప రిమ్స్‌కు తరలించారు.


