హార్సిలీహిల్స్ ఘాట్‌లో ప్రమాదం
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్‌రోడ్డుపై శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు. విజయవాడకు చెందిన ఓ కుటుంబం హార్సిలీహిల్స్‌పై విడిది చేసేందుకు వస్తోంది. కొండపైకి వె వెళుతుండగా అదే సమయంలో మదనపల్లె–1 డిపో ఆర్టీసీ బస్సు కొండ దిగుతోంది. ఘాట్‌రోడ్డుపై రాళ్లుపడిన చోట బస్సు కారును ఢీకొంది. దాంతో కారు ముందు భాగం నుజ్జనుజ్జయ్యింది. బస్సు ముందుభాగం కుడివైపు కొద్దిగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పర్యాటకులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కారును ఘటనాస్థలి నుంచి తరలించుకుని వెళ్లిపోయారు.
వీధి కుక్కలదాడి
– బాలుడికి తీవ్రగాయాలు
గాలివీడు : గాలివీడు మండలంలోని గరుగుపల్లి గ్రామం టంటంవారి పల్లెలో వీధి కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.వివరాలు..గురువారం రాత్రి వీధి కుక్కలపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో వీధి కుక్కలు గ్రామ వీధుల్లో కలియతిరుగుతూ ప్రజలను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో అడ్డుగా వచ్చిన ధనియాల యాసిర్(8) అనే బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాయి.అక్కడితో ఆగక వీధిలో ఆడుకుంటున్న ధరణి అనే బాలిక, మరో వ్యక్తిని గాయపరచగా, నీహా అనే బాలిక తప్పించుకుంది. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. కుక్కల బెడద నివారణకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు.
గడ్డివాములు దగ్ధం
రామసముద్రం : అగ్నిప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమైన సంఘటన రామసముద్రం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియల కోసం తీసుకెళ్తూ టపాకాయలు కాల్చారు. నిప్పురవ్వలు సమీపంలో ఉన్న హనుమంతు, రామాచారిల గడ్డివాములపై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.80వేలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు.
హార్సిలీహిల్స్ ఘాట్‌లో ప్రమాదం


