వీబీజీ రాంజీ స్కీంను రద్దు చేయాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి ఆ స్థానంలో వీబీజీ రాంజీ పేరుతో తీసుకొచ్చిన నూతన స్కీమ్‌ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలో రాష్ట్ర పార్టీ ముద్రించిన పోస్టర్లను ఇతర నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రం తీరుతో కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ కొత్త చట్టం రాష్ట్రానికి భారంగామారి, కార్పొరేట్లకు లాభం చేకూరుస్తుందని తెలిపారు. 2005 ఉపాధి హామీ చట్టం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు, సామాజిక న్యాయం, ఆర్థిక స్వాతంత్రం, భూస్వామ్య వర్గాలతో బేరమాడే శక్తి పేదలకు కల్పించిందన్నారు. ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే బలవంతపు భూసేకరణ ఆపాలని, సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న రైతు నాయకులు అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ చట్టం పెట్టి జైల్లో వేయడం దుర్మార్గమన్నారు. వెంటనే రైతు నాయకుడు అప్పలరాజునువిడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా సైన్యం వెనుజులా దేశంపై అర్ధరాత్రి బాంబులు వేసి దురాక్రమణ దాడి చేసి అధ్యక్షుని ఇంటి నుంచి బేడీ లేసి అమెరికాకు తరలించటం అత్యంత పాశవిక చర్య అని అన్నారు. సీపీఎం కడప జిల్లా కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజల వద్దకు ఈనెల 18 నుంచి 21 వరకు ఇంటింటికీ ఉపాధి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్ బి.మనోహర్, వి.అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.


