మనసు గెలిచిన మానవత్వం
కురబలకోట : రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితేనే పట్టించుకోకుండా చూస్తూ వెళ్లిపోయే రోజులివి. అలాంటిది ఓ వానరం రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా దానిని తెచ్చి 15 రోజులుగా వైద్య సేవలు అందించి కోలుకునేలా చేశారు. మానవత్వాన్ని చాటారు. గ్రామస్తులు, హనుమాన్ భక్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి–అంగళ్లు మార్గంలోని కెఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర 15 రోజుల క్రితం ఓ వానరాన్ని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న దానిని ఆంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరి కాయలు విక్రయించే రాజమ్మ చూసి చలించిపోయింది. వెంటనే పక్కనే ఉన్న భారీ ఆంజనేయ విగ్రహ నిర్వాహకులు లూబీ విశ్వనాథ్‌వద్దకు తీసుకెళ్లింది. వారు హుటాహుటిన మదనపల్లె పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స చేయించారు. వారి సంరక్షణలోనే ఉంచుకుని సపర్యలు చేయసాగారు. మరో వైపు అంగళ్లు పశు సంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సిబ్బందిని పురమాయించి ప్రతి రోజు దానికి చికిత్స చేయించారు. భక్త హనుమాన్ ఆశ్రమ నిర్వాహకులు కోసూరి (లూబీ) విశ్వనాఽథ్, ఎలక్ట్రిషన్ రామకృష్ణ, నార్లపల్లి మాంగాని రమణారెడ్డి, మరో భక్తురాలు ఎర్రదొడ్డి గంగులమ్మ ప్రత్యేక శ్రద్ధ వహించారు. స్థానిక పశు వైద్య సిబ్బంది ఎన్‌జీ ధరణీనాథ్ రెడ్డి, కనసానివారిపల్లి నిర్మల వానరానికి ఇంజెక్షన్లు, అవసరమైన మందులు రోజూ ఇస్తూ వచ్చారు. దీంతో ఇది క్రమేణా కోలుకుంటోంది. ఆశ్రమ వద్ద తిరుగాడుతూ మునుపటి స్థితికి వస్తోంది. ఓ వానరం కోసం ప్రతి రోజూ ఏడీ స్థాయి అధికారితో సహా ఎనిమిది మంది కనిపెట్టుకుని సపర్యలు చేయడం పలువురిని చలింపజేస్తోంది. వారి మానవత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
గాయపడిన వానరానికి పునరుజ్జీవం


